- పార్టీ నేతలకు రాహుల్ లేఖ
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం ఉన్న అణచివేత, దోపిడీ విద్యావ్యవస్థకు వ్యతిరేకంగా కాంగ్రెస్ యువజన విభాగం ఎన్‌ఎస్‌యూఐ ప్రారంభించిన విద్యార్థి ఉద్యమానికి పూర్తి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం పార్టీ నాయకులను కోరారు. ఈ మేరకు ఆయన పార్టీ జనరల్ సెక్రటరీలు, రాష్ట్రాల ఇన్‌చార్జ్‌లు, పీసీసీ అధ్యక్షులు, జిల్లా, నగర కమిటీల అధ్యక్షులకు ఒక లేఖ రాశారు.
ఛాత్రోన్ కీ గూంజ్ (విద్యార్థుల గర్జన) ప్రచారాన్ని దేశవ్యాప్త ఉద్యమంగా మార్చాలని, అందరికీ సమాన అవకాశాలు కల్పించే సరికొత్త విద్యావ్యవస్థకు బాటలు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ‘దేశంలోని యువత ప్రస్తుతం మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది.
పేపర్ లీక్‌లు, రద్దవుతున్న పరీక్షలు, పదే పదే మళ్లీ పరీక్షలు నిర్వహించడం, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో జాప్యం, ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవడం, పెరుగుతున్న నిరుద్యోగం, విపరీతంగా పెరిగిన విద్యా ఖర్చులు విద్యార్థులను, వారి కుటుంబాలను ఆవేదనకు గురిచేస్తున్నాయి’ అని రాహుల్ గాంధీ తన లేఖలో పేర్కొన్నారు. దేశ యువత ఎదుర్కొంటున్న ఈ దోపిడీ వెనక ఉన్న నిజాన్ని బట్టబయలు చేయాలన్నారు. నీట్ పేపర్ లీక్, సీబీఎస్‌ఈ ఆన్‌స్క్రీన్ మార్కింగ్ వివాదాల నేపథ్యంలో.. విద్యార్థుల కోసం కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఈ నిరసన ర్యాలీలను చేపట్టింది.
