విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం’. నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జులై 3న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి మాట్లాడుతూ ‘మేం సాఫ్ట్‌వేర్ కంపెనీ నుంచి సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిట్ అయ్యాక సినిమా ఇండస్ట్రీకి రావాలనుకున్నాం.
ఆ టైమ్‌లో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి గారు అభిషేక్ నామా చేస్తున్న ‘నాగబంధం’ స్క్రిప్ట్ గురించి చెప్పారు. ఆయన విజన్, కంటెంట్‌పై వున్న నమ్మకంతో రూ.110 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించాం. సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఒక అద్భుతమైన విజువల్ కనిపిస్తుంది. అలాంటి విజువల్స్‌ను అవుట్‌డోర్‌లో తీయడం సాధ్య కాదు. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ ఫీస్ట్ ఇవ్వాలని ప్రతి సెట్‌ను ఎంతో శ్రద్ధగా రూపొందించాం.
అలాగే విజువల్ ఎఫెక్ట్స్ విషయంలోనూ ఎక్స్‌ట్రా కేర్ తీసుకున్నాం. ట్రైలర్ చూసిన వాళ్లంతా ప్రామిసింగ్‌గా ఉందని అంటున్నారు. బాలీవుడ్ సహా ఇతర భాషల నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. మేం ఇండస్ట్రీకి కొత్త అయినప్పటికీ అనంత పద్మనాభస్వామి రథయాత్ర రూపంలో చేసిన ప్రమోషన్ అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇలాంటిది ఇప్పటివరకు ఎవరూ చేయలేదని ప్రశంసించారు. సినిమా మేము ఊహించినదానికంటే చాలా బాగా వచ్చింది. మేము పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుంది. ఇదొక విజువల్ స్పెక్టాకిల్‌గా నిలుస్తుంది’ అని చెప్పారు.
