నల్గొండ, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటనకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రోడ్లు, భవనాలు, రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ ఆదేశించారు. నల్గొండ పట్టణంలోని ఎన్ జీ కాలేజీ మైదానంలో జరుగుతున్న బహిరంగ సభ ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి పరిశీలించారు.
సభకు వచ్చే జనం కోసం వేస్తున్న టెంట్లు, లైటింగ్, సౌండ్ సిస్టమ్, ఎల్ఈడీ స్క్రీన్లు, బారికేడింగ్ వంటి పనులపై ఆరా తీశారు. సీఎం వేదికపైకి రాగానే ప్రజలందరికీ అభివాదం చేసేలా ప్రత్యేక ర్యాంప్ లేదా వాహనం కోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు.
అలాగే కనగల్ మార్కెట్ యార్డ్ సమీపంలో సిద్ధం చేసిన పైలాన్, దాని సుందరీకరణ పనులను పరిశీలించారు. అనంతరం పోలీస్ శిక్షణ కేంద్రం, కనగల్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను తనిఖీ చేశారు.
సీఎం పర్యటన సజావుగా సాగేలా రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని వికాస్ రాజ్ ఆదేశించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్లు జె. శ్రీనివాస్, వై. అశోక్ రెడ్డి, ఆర్ అండ్ బీ సీఈలు వెంకటేశ్వరరావు, రాజేశ్వర్ రెడ్డి, ఎస్ఈ శ్రీధర్ రెడ్డి, డీటీసీ వాణి ఉన్నారు.
