కరువు తీరా వానలు పడాలని పూజలు..సాగర్ తీరంలో వరుణయాగం

కరువు తీరా వానలు పడాలని పూజలు..సాగర్ తీరంలో వరుణయాగం
  • ప్రభుత్వ ఆధ్వర్యంలో  భారీ ఏర్పాట్లు
  • మంచికాలం వస్తుందని రైతన్నల ఆశ 

నల్గొండ, వెలుగు :  ఎల్​నినోతో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయన్న ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వరుణయాగాన్ని తలపెట్టింది. ఈ సీజన్​ ప్రారంభంలో రుతుపవనాల ప్రభావం కనిపించలేదు. 20 రోజులుగా వర్షం కురిసినా ప్రాజెక్టుల్లో ఇంకా ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు చేరలేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వరుణయాగాన్ని చేపట్టింది. 

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, కృష్ణా-గోదావరి నదులు పరవళ్లు తొక్కాలని ఆకాంక్షిస్తూ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఈ యాగం జరగనుంది. సీఎం రేవంత్​రెడ్డి ఈ యాగంలో పాల్గొననున్నారు. కేవలం తెలంగాణలో మాత్రమే వానలు పడితే సరిపోదు. ఎగువన మహారాష్ట్ర, కర్నాటకల నుంచి వరద వస్తేనే రెండు నదులపై ఉన్న ప్రాజెక్టులకు నీరు చేరుతుంది. 

ఇప్పుడిప్పుడే తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు ఎగువ నుంచి వరద చేరుతుంది. మహారాష్ట్ర, కర్నాటకల్లో వర్షపాతం, ఎగువ జలాశయాల్లో నిల్వలు, అక్కడి నుంచి విడుదలయ్యే నీటిని నీటిపారుదల శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రధానమైన నాగార్జునసాగర్ కు ఇంకా పెద్దగా నీరు చేరలేదు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం సుమారు 518 అడుగుల వద్ద ఉంది. గతేడాది ఇదే రోజుతో పోలిస్తే సుమారు 310.25 టీఎంసీల నిల్వ ఉండగా, నీటిమట్టం 589.40 అడుగుల వద్ద ఉంది. ఈ పరిస్థితుల్లో జరుగుతున్న వరుణ యాగం మీద రైతాంగం ఆశలు పెట్టుకుంది.

 కృష్ణాలో ప్రవాహాలు క్రమంగా పెరుగుతున్నప్పటికీ అవి సీజన్ పొడవునా స్థిరంగా కొనసాగేందుకు యాగం దోమదపడుతుందని నమ్ముతున్నారు. ‘కృష్ణా తీరాన జరిగే ఈ మహాక్రతువులో ఒకటే సంకల్పం సమృద్ధిగా వర్షాలు కురవాలి.. కృష్ణా, గోదావరి నదులు నిండుగా ప్రవహించాలి.. తెలంగాణ జలాశయాలు నిండాలి.. రైతాంగం సుభిక్షంగా ఉండాలన్నదే ప్రభుత్వ సంకల్పం’అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.