రోజు కాదు వారానికోసారి మాత్రమే.. 400 ఏళ్ళ క్రితం ప్రపంచంలో మొదటి వార్తాపత్రిక ఎలా పుట్టిందో తెలుసా..

రోజు కాదు వారానికోసారి మాత్రమే..  400 ఏళ్ళ క్రితం ప్రపంచంలో మొదటి వార్తాపత్రిక ఎలా పుట్టిందో తెలుసా..

రోజు ఉదయాన్నే పేపర్ బాయ్ వచ్చి మీ ఇంటి ముందు న్యూస్ పేపర్  వేయడం చూసే ఉంటారు. చాలామందికి వేడి వేడి టీ తాగుతూ, పేపర్ తిరగేస్తూ దేశవిదేశాల వార్తలు తెలుసుకోవడం అలవాటు. అయితే, అసలు ప్రపంచంలోనే మొట్టమొదటి వార్తాపత్రిక ఎక్కడ, ఎప్పుడు ముద్రించారో మీకు తెలుసా ? అసలు వార్తాపత్రికల చరిత్ర ఎంత పాతదో, అంత ఆసక్తికరంగా ఉంటుంది. మొదటి వార్తాపత్రిక కథేంటో ఇప్పుడు చూద్దాం....

చేతిరాత నుంచి ప్రింటింగ్ మిషన్ వరకు 
1605లో యూరప్‌లోని 'స్ట్రాస్‌బర్గ్' అనే నగరంలో వార్తాపత్రికల(newspaper) ముద్రణ మొదలైంది. 'జోహన్ కరోలస్' అనే వ్యక్తి ప్రపంచంలోనే మొట్టమొదటి ముద్రించిన వార్తాపత్రికను తెచ్చాడు. ఇది జర్నలిజం చరిత్రలోనే ఒక పెద్ద మార్పు. ఈ వార్తాపత్రిక పేరు 'రిలేషన్' (Relation als Furmen und Gedenkwürdigen Historien).

ప్రింటింగ్ మిషన్ రాకముందు జోహన్  కరోలస్ వార్తలను చేతితో రాసేవాడు. ఈ వార్తల్లో వేర్వేరు దేశాల్లో జరిగే ముఖ్యమైన విషయాలు ఉండేవి. కానీ, చేతితో రాయడం వల్ల ఎక్కువ  కాపీలు రాయడం కష్టమయ్యేది, సమయం కూడా చాలా పట్టేది. దాంతో వార్తలు చాలా తక్కువ మందికి మాత్రమే చేరేవి.

ఆ తర్వాత అతను ఒక ప్రింటింగ్ మిషన్‌ను కొనుగోలు చేసి, వార్తలను వేగంగా ప్రింట్ చేయడం మొదలుపెట్టాడు. దీనివల్ల ఒకే వార్తను ఒకేసారి చాలామందికి చేరవేయడం తేలికైంది. అప్పటివరకు చేతితో రాసే పద్ధతి మారి, వారానికోసారి వార్తాపత్రికను ముద్రించి అందరికీ పంచే పద్ధతి ఇక్కడే మొదలైంది. మొదట్లో పేపర్‌ను ప్రతిరోజూ కాకుండా, వారానికి ఒకసారి మాత్రమే ప్రచురించేవారు.

మొదటి వార్తాపత్రిక ఎలా ఉండేదంటే 
ఈ రోజుల్లో మనం చూసే వార్తాపత్రికలు చాలా పెద్ద సైజులో ఉంటాయి. ఒక్కో పేజీలో జాతీయ వార్తలు, రాష్ట్ర వార్తలు, ఆటలు, సినిమా, వ్యాసాలు ఇలా రకరకాల విభాగాలు ఉంటాయి. కానీ మొదటి వార్తాపత్రిక 'రిలేషన్' అలా ఉండేది కాదు. అది చూడటానికి చిన్న పుస్తకం   సైజులో ఉండేది.

సైజు చిన్నదైనా, అందులో రాసే విషయాలు మాత్రం చాలా ముఖ్యమైనవిగా ఉండేవి. రాజకీయాలు, యుద్ధాలు, రాజుల పరిపాలన, వివిధ ప్రాంతాల్లో జరిగే ముఖ్యమైన విశేషాలను సేకరించి అందులో ప్రచురించేవారు.

ఒక కొత్త విప్లవం
వేర్వేరు ప్రాంతాల నుంచి రోజూ వార్తలు సేకరించడం, వాటిని ప్రింట్ చేసి ప్రజలకు పంచడం అనేది ఆ కాలంలో ఒక వింతైన, కొత్త ఆలోచన. కరోలస్ తీసిన ఈ ముందడుగు సమాచార ప్రపంచంలో పెద్ద విప్లవాన్నే తెచ్చింది. దీని తర్వాత యూరప్‌లోని మిగతా నగరాల్లో కూడా వార్తాపత్రికలను ముద్రించడం వేగంగా మొదలైంది. అలా ఇప్పటి  ఆధునిక వార్తాపత్రికల రంగానికి బలమైన పునాది పడింది.