భవనాలు నిర్మించడం సులభమే... కానీ కలలకు పునాదులు వేయాలంటే ప్రభుత్వానికి బలమైన సంకల్పం ఉండాలని.. సరిగ్గా అదే సంకల్పంతో తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అత్యంత వేగంగా రూపుదిద్దుకుంటున్నాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక కీలక సందేశాన్ని పంచుకున్నారు.
ఆర్థిక, సామాజిక అసమానతలకు ముగింపు పలకాలనే ఉద్దేశంతో ఈ గురుకులాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. కులం, మతం, ప్రాంతం, కుటుంబ నేపథ్యం అనే ఎలాంటి సరిహద్దులు లేకుండా... ప్రతి చిన్నారికి ప్రపంచ స్థాయి విద్యను అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
ప్రతి నియోజకవర్గంలో అత్యాధునిక వసతులతో నిర్మితమవుతున్న ఈ విద్యాలయాలు కేవలం స్కూల్స్ మాత్రమే కావు... పేద కుటుంబాల పిల్లలను రేపటి శాస్త్రవేత్తలుగా, సమర్థులైన పరిపాలకులుగా, పారిశ్రామికవేత్తలుగా, నవభారత నిర్మాతలుగా తీర్చిదిద్దే దివ్యమైన జ్ఞాన మందిరాలుగా నిలవబోతున్నాయి.
►ALSO READ | హైదరాబాదీలకు అలర్ట్: ఆగస్టు 18 నుంచి KBR పార్క్ రూట్లో వన్ వే...
పేద పిల్లల కలలకు చిరునామాగా, అద్భుతమైన తెలంగాణ మోడల్‌కు ప్రతీకగా నిలవనున్న ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్... రాబోయే తరాల భవిష్యత్తును పూర్తిగా మార్చబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 105 నియోజకవర్గాల్లో ఈ మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తుండగా, ఇప్పటికే మెజారిటీ చోట్ల పనులు పరుగులు పెడుతున్నాయి. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు విడివిడిగా ఉన్న రెసిడెన్షియల్ విద్యా విధానం పిల్లల్లో చిన్నతనం నుంచే వేర్పాటు భావనను కలిగిస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఈ అడ్డుగోడలను కూల్చేస్తూ 'ఇంటిగ్రేటెడ్' విధానాన్ని తెచ్చింది. ప్రతి నియోజకవర్గంలో బాయ్స్కు ఒకటి, బాలికలకు మరొకటి చొప్పున ఈ స్కూళ్లను ప్లాన్ చేశారు. ఫస్ట్ ఫేజ్లో భాగంగా 105 నియోజకవర్గాలను ఎంపిక చేయగా, అందులో 86 స్కూళ్లకు సంబంధించి పనులు వివిధ దశల్లో ఉన్నాయి.ఇప్పటికే 78 పాఠశాలల టెండర్ల ప్రక్రియ పూర్తయి పనులు వేగంగా సాగుతుండగా, మిగిలిన చోట్ల స్థలాల కేటాయింపు, డీపీఆర్ తయారీ పనులు జరుగుతున్నాయి.
భవనాలు నిర్మించడం సులభమే... కానీ కలలకు పునాదులు వేయాలంటే ప్రభుత్వానికి సంకల్పం ఉండాలి.
— Revanth Reddy (@revanth_anumula) August 11, 2026
ఆ సంకల్పంతోనే తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి.
ఆర్థిక, సామాజిక అసమానతలకు ముగింపు పలుకుతూ... కులం, మతం, ప్రాంతం, కుటుంబ నేపథ్యం అనే… pic.twitter.com/m8GCxv7NQD
