మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. పాతబస్తీ మెట్రోకు టెండర్లు, కొత్త కోచ్ ల కొనుగోలు

మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. పాతబస్తీ మెట్రోకు టెండర్లు, కొత్త కోచ్ ల కొనుగోలు

హైదరాబాద్ మెట్రోకు మహర్దశ.. మెట్రో ఫేజ్2లో భాగంగా భూసేకరణ, మెట్రో పనులకు త్వరలో టెండర్లు పిలువనున్నారు. మెట్రో కు ప్రయాణికుల రద్దీరోజురోజుకు పెరుగుతున్నందున వారి సౌకర్యార్థం కొత్తకోచ్ లను కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఫేజ్ 2లో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ గుట్ట వరకు మెట్రో పనులు వేగవంతం చేసి టెండర్లు వేయాలను అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. 

హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశలో  భాగంగా పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం(ఆగస్టు 11) హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL)పై ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పాతబస్తీ మెట్రో పనులపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ పొడవునా రోడ్డు విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ కారిడార్ లో మెట్రో పనులకు టెండర్ ప్రక్రియను మొదలు పెట్టాలని అన్నారు.

మెట్రో విస్తరణకు సంబంధించి పెండింగ్ లో ఉన్న భూ సేకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. హైదరాబాద్ మెట్రోకు రోజురోజుకు రద్దీ పెరుగుతున్న క్రమంలో రద్దీకి అనుగుణంగా మెట్రో రైల్ కు అదనపు కోచ్ లను జత చేయాలని సూచించారు. ఇందుకు మెట్రో రైల్ కోచెస్ ను కొనుగోలుకు  చర్యలు తీసుకోవాలన్నారు. మెట్రో ఫేజ్-2 లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ కారిడార్ కోసం ప్రస్తుత టెక్నాలజీపై ఢిల్లీ మెట్రోను సంప్రదించి అవసరమైన సలహాలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. 

డిసెంబర్ లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 

డిసెంబర్ లో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు ముందస్తు ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. సమ్మిట్ నిర్వహణకు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి ఏర్పాట్లకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో సమ్మిట్ ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గత ఏడాది నిర్వహించిన సమ్మిట్ లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పురోగతి పూర్తి వివరాలతోరిపోర్టు తయారు చేయాలని ఆదేశించారు. పెట్టుబడుల్లో మరింత పురోగతి సాధించేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించాలనిసూచించారు. 

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, ప్రభుత్వ సలహాదారులు రామకృష్ణారావు, ఎన్వీఎస్ రెడ్డి, మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు ఎండీ అజిత్ రెడ్డిలు పాల్గొన్నారు.