- బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్
హనుమకొండ, వెలుగు: సర్ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ డా.కె.లక్ష్మణ్ మండిపడ్డారు. మజ్లిస్ పార్టీ ప్రాపకం కోసం ‘సర్’పై దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. ఈ నెల 29న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ వరంగల్‌లో ఉమ్మడి జిల్లా బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనానికి హాజరుకానున్న నేపథ్యంలో హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాట్లను శనివారం లక్ష్మణ్ పరిశీలించారు.
అనంతరం హంటర్ రోడ్డులోని వేద బంకెట్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్ద్వారా చనిపోయినవారి, దొంగ ఓట్లు, బంగ్లాదేశ్ రోహింగ్యాలను తొలగిస్తామంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అడ్డుకుంటున్నాయన్నారు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించిన పార్టీలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో మట్టికరిచాయని, ప్రధాని మోదీ నాయకత్వంలో ఈ బిల్లులు ఆమోదం పొందుతాయన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి కప్పం కట్టడానికి రాష్ట్రంలోని ఆస్తులను వేలం వేస్తూ సంపదను కొల్లగొడ్తున్నాడన్నారు. రాష్ట్రంలో మోదీ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, బీజేపీ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. సమావేశంలో పార్టీ జాతీయ కౌన్సిల్ మెంబర్ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మాజీ రాజ్యసభ ఎంపీ గరికపాటి మోహన్ రావు, పార్టీ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి, గంట రవి, లీడర్లు ధర్మారావు, పద్మారెడ్డి, సతీశ్ తదితరులు
పాల్గొన్నారు.
