నిర్మాతగా పలు సూపర్ హిట్స్ నిర్మించిన ఎంఎస్ రాజు.. దర్శకుడిగా రూపొందించిన తాజా చిత్రం ‘అగధ’. కాశీ విశాలాక్షి బలుసు నిర్మించారు. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా, వనిత విజయ్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. ఆగస్టు 14న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎంస్ఎస్ రాజు మాట్లాడుతూ ‘‘అగధ’ అంటే లోతైన అంశం, ఓ శూన్యం అని చెప్పుకోవచ్చు. మనం దేవుడ్ని, దెయ్యాలను కంటితో చూడలేదు. అలాంటి ఫోర్స్‌లకు మధ్య జరిగే కథ ఇది.
ఇందులో హారర్, భయపెట్టే అంశాలు మాత్రమే ఉండవు. దేవుడికి వ్యతిరేకంగా పనిచేసే ఓ దుష్ట శక్తిని ‘అగధ’ అన్నట్టుగా చూపించాను. ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేసి అందరినీ రంజింపజేసేలా రూపొందించా. నేను చూసిన రియాల్టీకి ఫాంటసీని జోడించి మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా తీశా. ‘దేవి’ నిర్మించే టైంలో నేను ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నా. కానీ ఏదో ఒక పవర్ నన్ను ముందుకు నడిపించింది. ఇప్పుడు ‘అగధ’ జర్నీలోనూ అలాంటి ఓ ఫోర్స్ ముందు ఉండి నడిపించినట్టుగా అనిపిస్తోంది.
ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ నుంచి వీఎఫ్‌ఎక్స్ వరకు ప్రతి క్రాఫ్ట్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకున్నాం. కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్ముతున్నా. గీతా ఆర్ట్స్, అన్నపూర్ణ స్టూడియో డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది. కన్నడ నుంచి హోంబలే టీం సంప్రదించింది. తెలుగు విడుదల తర్వాతే ఇతర భాషల్లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. దీనికి సీక్వెల్, ప్రీక్వెల్‌కు స్కోప్ ఉంది’ అని చెప్పారు.
