అల్లరి నరేష్ చాలా రోజుల తర్వాత తనదైన కామెడీ జానర్‌లో నటిస్తున్న చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 4న సినిమా విడుదల కానుంది. మంగళవారం ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో అల్లరి నరేష్ మాట్లాడుతూ ‘నేను సరైన కామెడీ సినిమా చేసి దాదాపు 10 సంవత్సరాలు అవుతోంది.
కొన్ని సీరియస్ మూవీస్ చేసినా.. కామెడీని ఎప్పుడూ వదల్లేదు. ఒక మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నా. ఈ కథ వినగానే హ్యాపీగా అనిపించింది. షూటింగ్ చేస్తున్నప్పుడు సెట్లో ఉన్న నటీనటులందరినీ చూస్తుంటే నాన్నగారి సినిమాలు గుర్తొచ్చేవని సెట్లో అందరూ చెప్పేవారు. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా. పదేళ్లుగా మీరు మిస్ అయ్యారనుకున్న నరేష్‌ను ఇందులో చూస్తారు. రెండున్నర గంటల పాటు నాన్‌స్టాప్‌గా నవ్విస్తాం’ అని చెప్పాడు.
ఈ మూవీ షూటింగ్ ఒక సెలబ్రేషన్‌లా జరిగిందని, తామంతా ఎంతో ఎంజాయ్ చేశామని హీరోయిన్ సురభి, రాశి సింగ్, ప్రిష రాజేష్, విష్ణుప్రియ అన్నారు. టీజర్ రెస్పాన్స్ బాగుందని సినిమా దీనికి రెట్టింపు వినోదం అందిస్తుందని దర్శకుడు చంద్ర మోహన్ చెప్పాడు. నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ ‘నరేష్ గారి వింటేజ్ కామెడీతో థియేటర్లలో నవ్వుల మోత మోగిపోతుంది’ అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్, ఎడిటర్ చోటా కె. ప్రసాద్, రైటర్ నందు పాల్గొన్నారు.
