వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు నిర్మించిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న సందర్భంగా మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ ‘ఒక సినిమా విజయం ఎంతోమందిలో ఆనందాన్ని నింపుతుంది. ఇలాంటి గొప్ప విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు తలవంచి ధన్యవాదాలు తెలియజేయడం మనందరి బాధ్యత. హారర్ కామెడీ చిత్రాలు గతంలో చాలా వచ్చాయి.
కానీ ఇందులో కొరియన్ ఫ్లేవర్‌ను, ఆ కల్చర్‌ను తీసుకురావడం చాలా గొప్ప ఆలోచన. ఈ విజయానికి ఆ ఆలోచన ప్రధాన కారణం. అందుకు దర్శకుడిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. సినిమా కమర్షియల్ సక్సెస్‌కు నా బిడ్డ వరుణ్ తేజ్ ముఖ్య కారణం. తన ప్రతి చిత్రంలోనూ వైవిధ్యం చూపిస్తూ, నటుడిగా ప్రతి సినిమాతో తనను తాను నిరూపించుకుంటున్నాడు. ఈ చిత్ర విజయానికి మరో బలమైన కారణం సత్య. అలాగే రితిక, మురళీధర్ గౌడ్ చాలా చక్కగా నటించారు.
అనుకున్న సమయానికి, అనుకున్న బడ్జెట్‌లో పూర్తి చేయగలగడం ఈ సినిమా తొలి సక్సెస్. ఇది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయం. టీమ్ అందరికీ అభినందనలు. మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు అనే విషయాన్ని ఇటీవల వరుస విజయాలు నిరూపిస్తున్నాయి’ అని చెప్పారు.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ ‘‘ప్రేక్షకులందరికీ సినిమా నచ్చి మంచి విజయాన్ని అందుకోవడం ఆనందంగా ఉంది. మా పెదనాన్న బర్త్ డే అయిన ఆగస్టు 22 నాకు నేషనల్ హాలిడే లాంటిది. ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్‌తో ఈ ఆగస్టు నాకు ఇంకా పెద్దదిగా మారింది’ అని అన్నాడు. నాగబాబు, డైరెక్టర్ క్రిష్.. టీమ్‌కు అభినందనలు తెలిపారు. టీమ్ అంతా పాల్గొన్నారు.
