ప్రభుత్వం గుడిసెలు కూలిస్తే.. ప్రజలు ప్రభుత్వాన్నే కూల్చేస్తరు.. వామపక్షాలు హన్మకొండ కలెక్టరేట్ ముట్టడికి యత్నం

ప్రభుత్వం గుడిసెలు కూలిస్తే..  ప్రజలు ప్రభుత్వాన్నే కూల్చేస్తరు.. వామపక్షాలు హన్మకొండ కలెక్టరేట్ ముట్టడికి యత్నం
  •      హనుమకొండ కలెక్టరేట్‌‌‌‌ ముట్టడికి వామపక్ష పార్టీలయత్నం.. ఉద్రిక్తత
  •     కూనంనేని సహా పలువురు వామపక్ష పార్టీ నేతల అరెస్ట్

హనుమకొండ, వెలుగు: నిరుపేదలు వేసుకున్న గుడిసెలను ప్రభుత్వం కూలిస్తే.. ప్రజలు ప్రభుత్వాన్నే కూల్చేస్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హెచ్చరించారు. ఇండ్లకు పట్టాలు ఇస్తారో.. ప్రభుత్వం నుంచి దిగిపోతారో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలు, ఇండ్లను కూల్చివేయడాన్ని నిరసిస్తూ శనివారం హనుమకొండలో సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్, ఎంసీపీఐయూ.. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గుడిసెవాసులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ హనుమకొండ గుండ్లసింగారం, గోపాలపూర్‌‌‌‌‌‌‌‌లోని ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న గుడిసెలను ఎందుకు కూల్చాల్సి వచ్చిందని ప్రశ్నించారు. 

ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు పట్టాలు ఇచ్చేదాకా పోరాడుతామని, ఈ పోరాటం వరంగల్ నుంచే మొదలుపెట్టామని స్పష్టం చేశారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా జూలై 1న అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు, 6న చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చి ఇందిరాపార్కు వద్ద వేలాది మంది పేదలతో ధర్నా నిర్వహిస్తామన్నారు. గత ప్రభుత్వం 58 జీవో ప్రకారం పేదల ఇండ్లను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి చేతులెత్తేసిందని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఓవైపు ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని చెబుతూనే.. మరోవైపు నిరుపేదల గుడిసెలు తొలగిస్తోందని మండిపడ్డారు. 

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్​వెస్లీ మాట్లాడుతూ ఎన్నికల టైంలో పేదలందరికీ ఇండ్లు, పట్టాలు ఇస్తామని హామీలిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు గుడిసెలన్నింటినీ కూలగొడ్తున్నారని మండిపడ్డారు. విలాసాలు, వ్యాపారాల కోసమో పేదలు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకోలేదన్నారు. సీపీఐఎంఎల్ (మాస్ లైన్) నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ చెరువులో మట్టిని అమ్ముకోవడానికే పేదల గుడిసెలు కూలగొడ్తున్నరని ఆరోపించారు. 

అదాలత్ జంక్షన్‌‌‌‌లో ఉద్రిక్తత

వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బాలసముద్రంలోని ఏకశిలా పార్క్ నుంచి హనుమకొండ కలెక్టరేట్‌‌‌‌కు ర్యాలీగా వెళ్తూ అదాలత్ జంక్షన్ వద్ద వామపక్ష పార్టీల నేతలు, గుడిసెవాసులు ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరగా కూనంనేని సాంబశివరావు, జాన్ వెస్లీ, తక్కెళ్లపల్లి శ్రీనివాస్ రావును పోలీస్ వాహనం ఎక్కించారు. గుడిసెవాసులు ప్రతిఘటించి, పోలీస్ వాహనం వెళ్లకుండా అడ్డుకుని నినాదాలు చేశారు. దీంతో అదాలత్ జంక్షన్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. 

అనంతరం ఏసీపీలు నరిసింహరావు, సత్యనారాయణ, ఇతర పోలీస్ సిబ్బంది ఆందోళనకారుల చెదరగొట్టి కూనంనేని, జాన్ వెస్లీ, శ్రీనివాస్ రావు సహా వామపక్ష పార్టీల నేతలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అనంతరం గుడిసెవాసులు అదాలత్ జంక్షన్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. కార్యక్రమంలో వామపక్ష పార్టీల లీడర్లు గాదగోని రవి, తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, కర్రె భిక్షపతి, షేక్ బాష్‌‌‌‌మియా, జి.ప్రభాకర్ రెడ్డి, సీహెచ్ రంగయ్య, తదితరులు పాల్గొన్నారు.