న్యూయార్క్: బిలియనీర్ గౌతమ్ అదానీపై ఉన్న లంచం, ఆర్థిక మోసాల క్రిమినల్ కేసును వెంటనే క్లోజ్ చేయడానికి అమెరికా ఫెడరల్ కోర్టు నిరాకరించింది. అదానీపై మోపిన చార్జీలను ఎందుకు విత్‌డ్రా చేసుకోవాలనుకుంటున్నారో పూర్తి వివరాలతో రిపోర్ట్ సబ్మిట్ చేయాలని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (డీఓజే)ను బ్రూక్లిన్ కోర్టు న్యాయమూర్తి నికోలస్ గరాఫిస్ ఆదేశించారు.
కేసును విత్‌డ్రా చేసుకోవడానికి డీఓజే ఈ ఏడాది మే నెలలో సమర్పించిన దరఖాస్తు చాలా షార్ట్‌గా, ఇన్‌ఫార్మల్‌గా ఉందని జడ్జి అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసును కొట్టేయడానికి గల కచ్చితమైన కారణాలను వివరించడానికి ప్రాసిక్యూటర్లకు వచ్చే నెల 13 వరకు సమయం ఇచ్చారు.
లంచం ఆరోపణలే కారణం
భారత ప్రభుత్వ అధికారులకు 250 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.2,400 కోట్లు) లంచాలు ఇచ్చి సోలార్ పవర్ కాంట్రాక్టులు పొందారని, ఈ విషయాన్ని దాచిపెట్టి అమెరికా ఇన్వెస్టర్లను మోసం చేశారని గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీలపై 2024లో అమెరికాలో కేసు నమోదైంది. అదానీ తరఫు లాయర్ రాబర్ట్ గియుఫ్రా వాదిస్తూ.. ఈ వ్యవహారం అమెరికా చట్టాల పరిధిలోకి రాదని, డీఓజే కేసును వెనక్కి తీసుకుందని కోర్టుకు లేఖ రాశారు.
ఈ క్రిమినల్ కేసు పక్కన పెడితే.. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) వేసిన సివిల్ కేసులో గౌతమ్ అదానీ 6 మిలియన్ డాలర్లు, సాగర్ అదానీ 12 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించడానికి అంగీకరించారు. అలాగే ఇరాన్ ఆంక్షల ఉల్లంఘన కేసులో అదానీ ఎంటర్‌ప్రైజెస్ యూఎస్ ట్రెజరీకి 275 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు సెటిల్‌మెంట్ చేసుకుంది.
సాధారణంగా ప్రాసిక్యూషన్ వద్దనుకున్న కేసును జడ్జిలు బలవంతంగా నడపలేరు, కానీ జడ్జి అధికారికంగా సంతకం చేసేవరకు అదానీపై చార్జీలు పెండింగ్‌లోనే ఉంటాయి.
