యాదాద్రి, వెలుగు: ‘సర్’ నిర్వహణలో కీలకమైన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కన్పిస్తోంది. యాదాద్రి జిల్లాలో 17 మండలాలు ఉన్నాయి. వీటిలో ఆలేరు నియోజకవర్గంలో 8 మండలాలు, భువనగిరి నియోజకవర్గంలో నాలుగు మండలాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. తుంగతుర్తిలో రెండు, మునుగోడులో రెండు, నకిరేకల్ నియోజవర్గాల్లో ఒక్కో మండలం ఉన్నాయి.
నియోజకవర్గాల వారీగా సర్ నిర్వహణ జరుగుతున్నందున ఆలేరులోని 8 మండలాల్లోని 309 పోలింగ్ సెంటర్లలో 2,21,903 ఓటర్లు, భువనగిరిలోని నాలుగు మండలాల్లోని 257 పోలింగ్ సెంటర్లలోని 2,38,040 ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందించాల్సి ఉంది. మొత్తంగా రెండు నియోజకవర్గాల్లో 4,59,943 ఓటర్లు ఉన్నారు. ఈ లెక్కన రెండు నియోజకవర్గాల్లోని మొత్తం పోలింగ్ సెంటర్లలో 9,19,886 ఫారాలు రావాల్సి ఉంది.
కానీ ఆలేరులో రెండు, భువనగిరిలో ఐదు పోలింగ్ కేంద్రాలకు ఫారాలు అసలు సరఫరానే కాలేదు. దీనికి తోడు అందిన కొన్ని ఫారాలలో ఓటర్ల పేర్లు, వివరాలు, ఫొటోలు స్పష్టంగా లేకపోవడం వంటి ముద్రణా లోపాలు ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించిన జిల్లా అధికారులు ఆ ఫారాల పంపిణీని నిలిపివేసి, సమస్యను రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కొరత ఉన్న, పాడైన ఫారాల స్థానంలో కొత్త వాటి కోసం అవసరమైన సంఖ్యను పేర్కొంటూ మళ్లీ ఆర్డర్ ఇచ్చారు.
