బెంగళూరు వెళ్తున్నారా.. ఏది పడితే అది తినొద్దు.. కల్తీ ఫుడ్ తో నిండిపోయిన హోటల్స్

బెంగళూరు వెళ్తున్నారా.. ఏది పడితే అది తినొద్దు.. కల్తీ ఫుడ్ తో నిండిపోయిన హోటల్స్

దేశవ్యాప్తంగా కల్తీ ఫుడ్ సంస్కృతి వేగంగా పెరుగుతోంది. వీధుల్లో దొరికే తినుబండారాలు మొదలుకొని స్టార్ హోటళ్ల వరకు తినే ఆహారం వరకుకల్తీ చేస్తూ వ్యాపారులు లాభాలు గడిస్తున్నారు.ముఖ్యంగా ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో ఈ కల్తీ విపరీతంగా సాగుతోంది. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కుళ్లిన నాన్ వెజ్, కూరగాయాలు, అవుట్ డేటెడ్ పాల ఉత్పత్తులను సర్వ్ చేస్తూ ప్రజల  ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. తాజాగా బెంగళూరులోని 5 స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లపై పుడ్ సేఫ్టీ అధికారులు చేపట్టిన రైడ్స్ లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 
 
దేశవ్యాప్తంగా స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార భద్రతా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. బెంగళూరులో 60కి పైగా 3 స్టార్, 5 స్టార్ హోటళ్లపై స్పెషల్ టీమ్స్ దాడులు చేసి, కుళ్ళిన కూరగాయలు, గడువు ముగిసిన పదార్థాలు, ఫంగస్ పట్టిన వస్తువులను గుర్తించి వెయ్యి కిలోలకు పైగా కలుషిత ఆహారాన్ని సీజ్ చేశాయి. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) నిబంధనల ప్రకారం లేబుల్స్ లేకపోవడం, కిచెన్లు అపరిశుభ్రంగా నిర్వహించడం వంటి లోపాలు బయపడ్డాయి. నిబంధనలు ఉల్లంఘించిన లగ్జరీ హోటళ్లకు అధికారిక నోటీసులు జారీ చేశారు. ఫుడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌ పరీక్షలకు పంపారు. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడేందుకు చిన్న రెస్టారెంట్ల నుంచి పెద్ద స్టార్ హోటళ్ల వరకు తనిఖీలను కఠినతరం చేశారు.

స్ట్రీట్ ఫుడ్ స్టాళ్ల నుంచి స్టార్ హోటళ్ల వరకు అధిక లాభాల కోసం ఆహార కల్తీ విస్తృతంగా జరుగుతోంది. ఇందులో నిషేధిత రంగులు, మినరల్ ఆయిల్, కెమికల్స్, నిల్వ ఉంచిన కుళ్ళిన ఆహారాన్ని ఉపయోగిస్తున్నారు. హోటళ్లలో అపరిశుభ్రమైన పదార్థాల నిర్వహణ, కుళ్లిన చికెన్, మాంసం వంటి వంటకాలలో వినియోగిస్తున్నారు.బూజు పట్టిన కూరగాయాలు, సరైన రీతిలో నిల్వ చేయడంలో నిర్లక్ష్యం స్పష్టంగా అధికారుల తనిఖీల్లో్ బయటపడుతున్నాయి. 

మరోవైపు బయటి మార్కెట్లో అమ్ముతున్న ఆహార పదార్తాల కల్తీ (Adulterated Food) వేగంగా పెరుగుతోంది. పాలు, నూనెలు, కారం, పసుపు వంటి నిత్యవసరాల్లో హానికారక కెమికల్స్  కలుపుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్లు తక్కువ ఖర్చుతో సరుకు తయారు చేయడానికి కెమికల్స్ వాడుతున్నారు. 

పాలను యూరియా, డిటర్జెంట్, స్టార్చ్ కలిపి కల్తీ చేస్తున్నారు. కారం, పసుపు వంటి వంటింటి వస్తువులను ఇటుక పొడి, రంగుల రసాయనాలు, సల్ఫ్యూరిక్ యాసిడ్ వంటి వాటితో కలుషితం చేస్తున్నారు. పామాయిల్, తక్కువ నాణ్యత గల నూనెలను కలిపి నూనెలను అమ్ముతున్నారు. ఉపయోగించిన టీ పొడిని మళ్లీ రంగు అద్ది టీ పొడి తయారు చేస్తుననారు. రంగురాళ్లు, మెటానిల్ ఎల్లో (Metanil yellow) వంటి కెమికల్స్ కలిపి ధాన్యాలు, పప్పులను కల్తీ చేస్తున్నారు. అసలు పదార్థం మోతాదు తగ్గించి, దాని స్థానంలో ఆర్టిఫిషియల్ కెమికల్స్ కలుపుతున్నారు. బరువు పెంచడానికి నీరు, స్టార్చ్, సున్నపు నీరు వాడుతున్నారు. ఆకర్షణీయమైన రంగుల కోసం హానికరమైన కెమికల్ డైస్ (Chemical dyes) ఉపయోగిస్తున్నారు.

ఇలాంటి కల్తీ ఆహారంతినడం వల్ల కాలేయం (Liver), మూత్రపిండాలు (Kidneys) దెబ్బ తినే అవకావంఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయి. జీర్ణశక్తి కోల్పోవడం, కడుపునొప్పి సమస్యలు వస్తాయి. పిల్లల్లో ఎదుగుదల లోపాలు కలుగుతాయి. 

హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి  మెట్రో నగరాల్లోని ఈ కల్తీ వ్యాపారం జోరుగా సాగుతోంది. పెద్ద గోదాములలో నిత్యవసర సరుకుల కల్తీ పెద్ద ఎత్తున జరుగుతోంది.హోటళ్లు, రద్దీ మార్కెట్లలో లూజ్ నూనెలు, పాలు, కూరగాయలు కల్తీ చేసి లాభాలు గడిస్తున్నారు వ్యాపారులు. రోజురోజుకు ఆహారం కల్తీ పెరుగుతున్న క్రమంలో దేశవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఫుడ్ కల్తీ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.