న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ నుంచి బహిష్కరణకు గురై, ఇండియాలో ఆశ్రయం పొందుతున్న బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింత వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. షేక్ హసీనా అప్పగింతపై ఇండియా, బంగ్లాదేశ్ మధ్య చర్చలు జరిగాయి. సోమవారం (ఆగస్ట్ 10) బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషనర్ దినేష్ త్రివేది, ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ ఢాకా వేదికగా భేటీ అయ్యారు.
ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ఈ భేటీలో కీలకమైన షేక్ హసీనా అప్పగింత వ్యవహారం కూడా చర్చకు వచ్చినట్లు బంగ్లాదేశ్ ప్రధాని కార్యాలయం పేర్కొంది. షేక్ హసీనాను అప్పగించే ప్రక్రియను భారత్ వేగవంతం చేస్తుందని ఆశిస్తున్నామని పేర్కొంది. అలాగే, స్టూడెంట్ లీడర్ ఉస్మాన్ హదీ హత్య నిందితుడిని తిరిగి తీసుకురావడం గురించి కూడా చర్చ జరిగినట్లు తెలిపింది.
►ALSO READ | అసెంబ్లీలోకి దూసుకెళ్లిన విద్యార్థులు.. జార్ఖండ్ అసెంబ్లీ వాయిదా.. పరిస్థితి ఉద్రిక్తం!
బంగ్లాలోని భారత హైకమిషనర్ దినేష్ త్రివేది ఈ భేటీ వివరాలను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. బంగ్లాదేశ్‌తో సానుకూల, నిర్మాణాత్మక, భవిష్యత్ దృష్టితో కలిసి పనిచేయాలనే ఉద్దేశాన్ని బంగ్లా పీఎంకు తెలియజేశానని తెలిపారు. సమావేశం సానుకూలంగా జరిగిందన్నారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే మార్గాలపై చర్చించామని తెలిపారు. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని.. కొన్ని సమస్యలను దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. బంగ్లా పీఎం రెహమాన్‌కు కలవడం సంతోషంగా ఉందని.. ఆయన ప్రజల మనిషి అని త్రివేది కొనియాడారు.
