- చైనా, అమెరికా పైనే ఎక్కువ బాధ్యత ఉంటుంది
- అమెరికా పర్యటనలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్
- వైట్‌హౌస్‌లో ట్రంప్, జిన్‌పింగ్ చర్చలు ప్రారంభం
- జిన్ పింగ్‌కు డొనాల్డ్ ట్రంప్ ఘన స్వాగతం
వాషింగ్టన్ డీసీ: కృత్రిమ మేధ (ఏఐ) అభివృద్ధి ఎప్పుడూ మానవ నియంత్రణలోనే ఉండాలని, అది ప్రజల శ్రేయస్సుకే ఉపయోగపడాలని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అన్నారు. ఏఐలో ముందున్న అమెరికా, చైనాలకు దాన్ని మంచి కోసం వాడే సామర్థ్యంతో పాటు బాధ్యత కూడా ఉందని నొక్కి చెప్పారు. అధికారిక పర్యటనలో భాగంగా వాషింగ్టన్ వచ్చిన జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలకు ముందు వైట్‌హౌస్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఓవల్ ఆఫీస్‌లో జరుగుతున్న చర్చల్లో బలహీనంగా ఉన్న వాణిజ్య యుద్ధ విరమణ ఒప్పందం, తైవాన్, ఏఐ అంశాలు ప్రధానంగా రానున్నాయి. వీటితో పాటు ఇరాన్‌కు, ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాకు చైనా ఇస్తున్న మద్దతు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
మా ఇద్దరి మధ్య గొప్ప స్నేహం: ట్రంప్
జిన్‌పింగ్‌కు ఎయిర్ పోర్టులో ఘనంగా స్వాగతం పలికిన ట్రంప్, తమ ఇద్దరి మధ్య "నిజంగా గొప్ప స్నేహం" ఉందన్నారు. రెండు దేశాల సమస్యల పరిష్కారంలో "అద్భుతమైన పురోగతి" సాధించామని చెప్పారు. చర్చల్లో భద్రత, సాంకేతికత, ఏఐపై దృష్టి పెడతామని, అమెరికా–చైనా వాణిజ్య సంబంధాల బలోపేతానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
ఇరు దేశాల మధ్య విశ్వాసం పెరగాలి: జిన్ పింగ్
చైనా, అమెరికా మధ్య పరస్పర విశ్వాసం పెరగాలని జిన్ పింగ్ అన్నారు. శాంతియుతంగా కలిసి ఉండాలని, ఘర్షణలను నివారించాలని కోరారు. రెండు దేశాల ప్రయోజనాలు మిళితమై ఉన్నాయని స్పష్టం చేశారు.
