రాత్రికి రాత్రే ఊళ్ళు దాటి.. బ్రిటీష్ వారిని భయపెట్టిన 1857 నాటి వింతైన చపాతీ స్టోరీ!

రాత్రికి రాత్రే ఊళ్ళు దాటి.. బ్రిటీష్ వారిని భయపెట్టిన 1857 నాటి వింతైన చపాతీ స్టోరీ!

1857లో కొన్ని నెలల పాటు, ఉత్తర భారతదేశంలోని గ్రామాల నుండి వేల చపాతీలు ఒక వింతైన రీతిలో ఒకరి నుంచి ఒకరికి చేతులు మారాయి. రాత్రికి రాత్రే మనుషులు పరిగెడుతూ వీటిని ఒక ఊరి నుంచి మరో ఊరికి తీసుకెళ్ళేవారు. కొన్ని ప్రదేశాల్లోనైతే ఈ చపాతీలు ఒకే రాత్రిలో ఏకంగా 300 కిలోమీటర్లు ప్రయాణించాయట ! ఆ కాలంలో బ్రిటీష్ వారి తపాలా (పోస్ట్) కంటే వేగంగా ఇవి ఊళ్ళు దాటేశాయి!

ఇది చూసి బ్రిటీష్ అధికారులు తీవ్ర గందరగోళంలో పడిపోయారు.  అసలు ఈ చపాతీల లోపల ఏమైనా రహస్యలు ఉన్నాయా ? లేదా తిరుగుబాటుకు ఏమైనా సైగలు చేసుకుంటున్నారా ? అని అనుమానించి... చాలా చపాతీలను స్వాధీనం చేసుకుని, క్షుణ్ణంగా పరీక్షించి చూశారు !

వాళ్ళకి అందులో ఏం దొరికిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..  మన భారతదేశంలో రకరకాల 'రోటీల' గురించి మీకు ఎంతవరకు తెలుసో చూద్దామా.. !  

స్టాప్ 1: రాజస్థాన్ — బాజ్రా రోటీ (సజ్జ రొట్టె)
మానవ నాగరికతలోనే అత్యంత పురాతనమైన రొట్టెలలో సజ్జ రొట్టె ఒకటి. ఇది వేల సంవత్సరాలుగా మన ఆహారంలో భాగమైంది.  గ్లూటెన్ లేని ఈ పిండిని మెత్తటి, రుచికరమైన రొట్టెగా చేయడం వెనుక చాలా ఏళ్ళ అనుభవం ఉంది. దీనిని వెన్న, బెల్లం, వెల్లుల్లి చట్నీ లేదా కారంగా ఉండే కూరలతో తింటే సూపర్ గా  ఉంటుంది. 

స్టాప్ 2: కర్ణాటక — అక్కీ రోటీ (బియ్యపు రొట్టె)
కర్ణాటక ప్రత్యేక వంటకం ఇది. వేడి నీటిలో బియ్యప్పిండి కలిపి ఈ రొట్టె తయారుచేస్తారు. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, సోంపు ఆకులు, కరివేపాకు వేసి... నేరుగా పెనం మీద గానీ లేదా బటర్ పేపర్ మీద గానీ చేత్తో ఒత్తి కాలుస్తారు. దీనిని కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, వెజిటెబుల్ కుర్మా లేదా కేవలం వెన్న/నెయ్యితో తింటే అద్భుతంగా ఉంటుంది.

స్టాప్ 3: పంజాబ్-- మక్కీ ది రోటీ (జొన్న రొట్టె)
చలికాలంలో హాయిగా మంచం మీద కూర్చుని వేడివేడి జొన్న రొట్టె, ఆకుకూర తింటే ఆ మజాయే వేరు. జొన్నలు జీర్ణమవ్వడానికి సమయం పడుతుంది కాబట్టి చలికాలంలో శరీరానికి మంచి శక్తినిస్తాయి. అయితే ఇందులో గ్లూటెన్ ఉండదు కాబట్టి పిండి త్వరగా విరిగిపోతుంది. అందుకే దీనికి కాంబినేషన్‌గా పీచు, ఐరన్ ఎక్కువగా ఉండే ఆకూకూరను,  వెన్న లేదా నెయ్యిని కలిపి తింటారు.

స్టాప్ 4: గుజరాత్ — మెంతి థేప్లా
మీరు రైలు ప్రయాణాలు చేసేవారైతే, ఎవరైనా మెంతి థేప్లా  తినడం ఖచ్చితంగా చూసే ఉంటారు. గోధుమపిండి, శనగపిండి, మెంతికూర, పెరుగు ఇంకా రకరకాల మసాలాలు కలిపి వీటిని చేస్తారు. ఇవి సాధారణ రోటీల కంటే చాలా రోజుల పాటు పాడుకాకుండా తాజాగా ఉంటాయి. అందుకే దూర ప్రయాణాలకు, పిక్నిక్‌లకు ఇవి పర్ఫెక్ట్. మామిడికాయ తురుము పచ్చడి, ఊరగాయ, పెరుగు లేదా ఒక కప్పు వేడి టీతో తింటే అద్భుతంగా ఉంటుంది.

స్టాప్ 5: జార్ఖండ్ — మారువా రోటీ (రాగి రొట్టె)
దక్షిణాదిలో మనం తినే రాగి రొట్టెకి ఇది తూర్పు భారత వెర్షన్. జార్ఖండ్‌లోని గిరిజన ప్రాంతాల్లో మారువా ( రాగి) పిండితో చేసే ఈ రొట్టె చాలా పురాతనమైన ఆహారం. ఇందులో కాల్సియం, ఐరన్, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. గ్లూటెన్ ఉండదు కాబట్టి దీన్ని అప్పడంలా కర్రతో చేయరు, చేత్తోనే చేయాల్సి ఉంటుంది. దీనిని ఆలు కుర్మా, బంగాళాదుంప కర్రీ, ఆకుకూరలు, వంకాయ కర్రీతో  లేదా కొద్దిగా నెయ్యితో తింటారు.

స్టాప్ 6: పంజాబ్ — ఫుల్కా
 పంజాబ్‌లోనే పుట్టినా, ఈరోజు భారతదేశంలో ప్రతి ఇంట్లోనూ చేసుకునే సాధారణ వంటకం ఫుల్కా. పెనం మీద కాస్త కాలిన తర్వాత నేరుగా మంట మీద పెట్టగానే, లోపల ఆవిరి నిండి పూరీలా పొంగుతుంది. దీనిని వెజిటేబుల్ కర్రీలతో తింటే బాగుంటుంది. 

ఫుల్కా, చపాతీ, రోటీ... అసలు తేడా ఏంటి?
మనం ఈ మాటలను ఒకేలా వాడేస్తుంటాం, కానీ చిన్న తేడా ఉంది:

రోటీ: భారతీయ రొట్టెలు అన్నింటినీ కలిపి పిలిచే సాధారణ పేరు.

ఫుల్కా: పెనం మీద కాలిన తర్వాత నేరుగా మంట మీద కాల్చి, మెత్తగా పొంగించే రొట్టె.

చపాతీ: మంట మీద పెట్టకుండా, కేవలం పెనం మీద మాత్రమే పూర్తిగా కాల్చే రొట్టె.

మొత్తానికి అంతలా వెతికిన బ్రిటీష్ వారికి ఆ వింత చపాతీల లోపల ఏం దొరికిందో తెలుసా ? ఏమీ దొరకలేదు... ఖాళీ... ఆ చపాతీల  ఉద్యమం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటో ఇప్పటికి ఎవ్వరికీ తెలియదు. బ్రిటీష్ వారిని భయపెట్టడానికే అలా చేశారా ? 1857 సిపాయిల తిరుగుబాటుకు సంబంధించిన సంకేతమా ? లేదా కలరా వ్యాధి ఉన్న ప్రాంతాలకు పంపిన ఆహారమా ? అనేది ఇప్పటికీ  ఒక వింతైన, ఆసక్తికరమైన కథ.