రెండేళ్ల పాటు H-CITY ప్రాజెక్ట్..  కేబీఆర్ పార్క్ చుట్టూ వెళ్లాలంటే ఈ రూల్స్ తప్పనిసరి

రెండేళ్ల పాటు H-CITY ప్రాజెక్ట్..  కేబీఆర్ పార్క్ చుట్టూ వెళ్లాలంటే ఈ రూల్స్ తప్పనిసరి

హైదరాబాద్ నగరవాసులకు  కీలక హెచ్చరిక. కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రయాణించే రూట్  ఇకపై పూర్తిగా మారబోతోంది. ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారంగా చేపట్టిన ప్రతిష్టాత్మక H-CITY ప్రాజెక్ట్ పనులు ఊపందుకున్నాయి. ఈ  క్రమంలో హైదరాబాద్ సీపీ  సజ్జనార్  కీలక ప్రకటన చేశారు.

కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీని నివారించడానికి, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనుల నిమిత్తం.. ఆగస్టు 18వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ప్రత్యేక వన్-వే ట్రాఫిక్ విధానం అమల్లోకి రానుందని తెలిపారు. ఈ H-CITY ప్రాజెక్ట్‌లో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న 6 మేజర్ స్పాట్లలో మొత్తం 110 పిల్లర్లను నిర్మించనున్నారని చెప్పారు. ఇప్పటికే 15 పిల్లర్లకు సంబంధించిన గ్రౌండ్ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ నిర్మాణాలు పూర్తి కావడానికి దాదాపు 2 సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉందన్నారు. ఈ రెండు సంవత్సరాల పాటు కేబీఆర్ పార్క్ చుట్టూ ఈ వన్-వే రూల్స్ కొనసాగుతాయన్నారు.  ఇప్పటికే అధికారులు రెండుసార్లు విజయవంతంగా పైలట్ ట్రయల్స్ నిర్వహించి, ప్రత్యామ్నాయ మార్గాలపై సమగ్ర అధ్యయనం చేశారని వెల్లడించారు. 

కీలక సూచనలు

  • వాహనదారులారా ఇప్పటి నుంచే మీ మైండ్‌ను ట్యూన్ చేసుకోండి. మీ రోజువారీ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోండి.
  • కీలక ప్రాంతాల్లో లేన్ మార్కింగ్‌లు, ప్రత్యేక సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు.
  • గూగుల్ మ్యాప్స్ , నావిగేషన్ రూట్లలోనూ తగిన మార్పులు చేశారు.
  • అంబులెన్స్‌లు, ఫైర్ ఇంజిన్ల వంటి అత్యవసర వాహనాల కోసం ప్రత్యేకంగా లేన్-2 కేటాయించారు. వాటికి ఎలాంటి ఆటంకం కలిగించవద్దు.
  • రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే తీవ్రమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. రాత్రి వేళల్లోనూ రాంగ్ సైడ్ డ్రైవింగ్‌కు ఎలాంటి అనుమతి లేదు.
  • రోడ్లపై అనధికారికంగా, మలుపుల వద్ద వాహనాలను పార్క్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయి.
  • సోషల్ మీడియాలో వచ్చే ధ్రువీకరించని వదంతులను నమ్మకండి. కేవలం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అధికారిక అప్‌డేట్స్‌ను మాత్రమే ఫాలో అవ్వండి.
  • కమాండ్ కంట్రోల్ సెంటర్ , సీసీటీవీల ద్వారా 24 గంటలూ ట్రాఫిక్ నిరంతరం పర్యవేక్షించబడుతుంది. కొద్ది కాలం పాటు మీరు కొంచెం ఓపిక పడితే, భవిష్యత్తులో అత్యంత సులభమైన, సాఫీ సాగే ప్రయాణ రూట్ మీసొంతం అవుతుంది.
  • ఈ ట్రాఫిక్ మార్పులకు నగర ప్రజలందరూ పూర్తిగా సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి .