అత్యుత్సాహం.. క్షణాల్లో నీటిలోనే పోయిన ప్రాణం: రాంగ్ డైవ్ చేసి స్విమ్మింగ్ పూల్‌లో యువకుడి మృతి!

అత్యుత్సాహం.. క్షణాల్లో నీటిలోనే పోయిన ప్రాణం: రాంగ్ డైవ్ చేసి స్విమ్మింగ్ పూల్‌లో యువకుడి మృతి!

ఫ్రెండ్స్ తో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసేందుకు వెళ్లిన ఓ యువకుడి విహారయాత్ర, ఊహించని రీతిలో విషాదాంగా మారింది. స్విమ్మింగ్ పూల్ దగ్గర మ్యూజిక్, డ్యాన్స్‌లు, నవ్వులతో సాగిన ఆనందం.. ఒక్కసారిగా మృత్యు కేకలతో ముగిసిపోయింది. పిల్లల కోసం కేటాయించిన తక్కువ లోతు ఉన్న పూల్‌లోకి తల కిందులుగా డైవ్ చేయడంతో ఓ 25 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా మాల్వాన్‌లోని ఒక  రిసార్ట్‌లో జూన్ 20న జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అందరినీ కలచివేస్తోంది.

అసలేం జరిగిందంటే 
కొల్హాపూర్ జిల్లాకు చెందిన శ్రేణిక్ మిలింద్ తకాలే (25) అనే యువకుడు,  తొమ్మిది మంది ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా హాలిడేస్ గడపడానికి మాల్వాన్‌లోని ఒక రిసార్ట్‌కు వెళ్లాడు. ఆ రోజు మధ్యాహ్నం  ఫ్రెండ్స్  కలిసి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు పూల్‌లో ఈత కొడుతుండగా, మిగిలిన వారు పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేస్తున్నారు.

ఆ ఉత్సాహంలో శ్రేణిక్.. పూల్ పక్కనే ఉన్న దాదాపు 8 నుండి 10 అడుగుల ఎత్తున్న ఒక గోడ పైకి ఎక్కాడు. అక్కడ నుండి కింద ఉన్న పూల్‌లోకి తల కిందులుగా దూకాడు. అయితే, అతను దూకిన ప్రదేశం పిల్లల కోసం సెట్ చేసిన స్విమ్మింగ్  పూల్ సెక్షన్.

పాపం.. లోతు గమనించలేదు
ఆ పూల్ కేవలం నాలుగు అడుగుల లోతు మాత్రమే ఉంది. అంత ఎత్తు నుండి దూకడంతో శ్రేణిక్ తల చాలా వేగంగా, బలమైన ఫోర్స్‌తో పూల్ అడుగు భాగానికి గుద్దుకుంది. దాంతో అతని తలకు, మెడకు తీవ్రమైన గాయాలై పూల్‌లోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్నేహితులు వెంటనే గమనించి అతడిని నీటిలోంచి బయటకు తీసి, స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతను చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు. కొడుకు మరణవార్త విన్న తండ్రి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఆ రాత్రే రిసార్ట్‌కు చేరుకున్నారు. పోలీసులు దీనిని ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేశారు.