కన్నడలో చాట్‌జీపీటీతో ముచ్చట్లు.. బెంగళూరు ఆటో డ్రైవర్ స్టోరీ వైరల్

కన్నడలో చాట్‌జీపీటీతో ముచ్చట్లు.. బెంగళూరు ఆటో డ్రైవర్ స్టోరీ వైరల్

బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ చాట్‌జీపీటీని తన రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగిస్తున్నాడో వివరించి సోషల్ మీడియాలో అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన వీడియోలో, ఏ సందేహం వచ్చినా చాట్‌జీపీటీని అడుగుతానని, ప్రశ్నలను ఆంగ్లంలో టైప్ చేసి, సమాధానాలను కన్నడలో పొందుతానని చెప్పాడు.

చాట్‌జీపీటీ(Chat GPT) పాత ప్రశ్నలను కూడా గుర్తుంచుకుని వాటికి అనుసంధానంగా సమాధానాలు ఇస్తుందని ఆయన తెలిపారు. పని, వివాహం, సాధారణ విషయాలతో పాటు అనేక అంశాలపై సమాచారం తెలుసుకోవడానికి దీనిని ఉపయోగిస్తున్నానన్నారు. అలాగే చాట్‌జీపీటీ కన్నడలో మాట్లాడడం, రాయడం తనకు ఎంతో ఉపయోగపడుతోందని వివరించాడు. అయితే కేపీ జ్యోతిష్యం (కృష్ణమూర్తి పద్ధతి) వంటి కొన్ని ప్రత్యేక అంశాలపై చాట్‌జీపీటీ ఇచ్చే సమాచారం కొన్నిసార్లు పూర్తి స్థాయిలో ఉండదని ఆటో డ్రైవర్ చెప్పాడు. 

ఈ వీడియో ఓపెన్‌ఏఐ దృష్టిని కూడా ఆకర్షించింది. చాట్‌జీపీటీ అధికారిక ఖాతా స్పందిస్తూ, "అంకుల్‌కు సహాయం చేయడం ఎప్పుడూ ఆనందమే. ఈ వీడియోను పంచుకున్నందుకు ధన్యవాదాలు" అని కామెంట్ చేసింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆటో డ్రైవర్ నేర్చుకోవాలనే ఆసక్తిని, కొత్త టెక్నాలజీని  స్వీకరించిన తీరును ప్రశంసించారు. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే  చాలు వయసు అనేది అడ్డంకి కాదని ఎవరైనా టెక్నాలజీని  సులభంగా ఉపయోగించగలరని ఈ ఘటన మరోసారి నిరూపించింది.