OTT Review: హాట్‌స్టార్‌లో ట్రెండ్ అవుతున్న ఓటీటీ మూవీ.. ప్రేమను కోల్పోయిన యువకుడు కలెక్టర్ అయితే!

OTT Review: హాట్‌స్టార్‌లో ట్రెండ్ అవుతున్న ఓటీటీ మూవీ.. ప్రేమను కోల్పోయిన యువకుడు కలెక్టర్ అయితే!

రొమాన్స్, ఎమోషన్స్, రాజకీయాలు, ప్రతీకారం వంటి అంశాల మేళవింపుతో తెరకెక్కిన వెబ్‌సిరీస్ ‘తుక్రా కే మేరా ప్యార్’. ఈ లేటెస్ట్ హిందీ డ్రామా ప్రస్తుతం జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. సంచిత బసు, ధవళ్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు శ్రద్ధ పాసి జైరత్ దర్శకత్వం వహించారు.

ప్రేమికులుగా విడిపోయిన ఇద్దరు వ్యక్తులు శత్రువులుగా మారితే పరిస్థితులు ఎలా ఉంటాయనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మొదటి సీజన్ విజయాన్ని కొనసాగిస్తూ, ఈసారి కథను మరింత ఉత్కంఠభరితమైన మలుపులతో మేకర్స్ తెరకెక్కించారు. హార్ట్‌బ్రేక్, పగ, భావోద్వేగాల మధ్య సాగే మైండ్ గేమ్స్ ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్‌ను అందిస్తాయి.

కథేంటంటే:

కుల్దీప్ కుమార్ (ధవళ్ ఠాకూర్) శాన్విక చౌహన్ (సంచిత బసు) ప్రేమించుకుంటారు. డబ్బు, పలుకుబడి ఉన్న మనోహర్ సింగ్, వాళ్ల ప్రేమను తిరస్కరిస్తాడు. వాళ్లిద్దరూ విడిపోయాక ఆ కసితోనే కుల్దీప్ కలెక్టర్ అవుతాడు. తన అధికారాలను ఉపయోగించి శాన్విక కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటాడు. అయితే కొన్ని కారణాల వల్ల శాన్విక తన తండ్రిని, భర్తను కోల్పోతుంది. దాంతో తన తండ్రి స్థానంలో శాన్విక రాజకీయాల్లోకి వస్తుంది.

ప్రజలంతా ఆమెను ఎంతగానో అభిమానిస్తారు. ఒకానొక టైంలో తాను కలెక్టర్ కావడానికి అవసరమైన సాయం రహస్యంగా అందించింది శాన్విక అని కుల్దీప్ తెలుసుకుంటాడు. గతంలో ఏ కారణంగా శాన్విక తనకు దూరమైందో తెలుసుకుని బాధపడతాడు. ఆమెను కలుసుకుని మాట్లాడాలని భావిస్తాడు. అందుకోసం అతను ఏం చేస్తాడు? వాళ్లిద్దరూ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు? అనేది మిగతా కథ.

విశ్లేషణ:

‘తుక్రా కే మేరా ప్యార్’ సాధారణ ప్రేమకథ కాదు. ప్రేమ, నమ్మకద్రోహం, ప్రతీకారం, అధికారం, రాజకీయాల వంటి అంశాలను మిళితం చేసి రూపొందించిన ఎమోషనల్ పొలిటికల్ డ్రామా ఇది. ఒకప్పుడు ప్రాణంగా ప్రేమించుకున్న ఇద్దరు వ్యక్తులు పరిస్థితుల కారణంగా దూరమై, తర్వాత ఒకరిపై ఒకరు ప్రతీకారం తీర్చుకోవాలనే స్థాయికి చేరుకోవడం కథలో ఇంట్రెస్టింగ్ పాయింట్.  

కుల్దీప్ పాత్రలో ధవళ్ ఠాకూర్ ప్రేమలో విఫలమైన యువకుడి బాధను, ఆ బాధ నుంచి పుట్టిన కోపం, ప్రతీకార భావనను బాగా చూపించాడు. మరోవైపు శాన్విక పాత్రలో సంచిత బసు అమాయకమైన ప్రేమికురాలిగా, ఆ తర్వాత బాధ్యతలు తీసుకున్న రాజకీయ నాయకురాలిగా రెండు విభిన్న కోణాలను సహజంగా ఆవిష్కరించింది.

సిరీస్‌లో ప్రేమకథతో పాటు రాజకీయాల నేపథ్యంలో సాగే అధికార పోరాటం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ, పగ, బాధ్యతల మధ్య పాత్రలు తీసుకునే నిర్ణయాలు కథను ముందుకు నడిపిస్తాయి. కథలో వచ్చే ట్విస్టులు, పాత్రల మధ్య భావోద్వేగ సంఘర్షణలు ప్రేక్షకులను చివరి ఎపిసోడ్ వరకు ఆసక్తిగా చూసేలా చేస్తాయి.

అయితే కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా సాగిన భావన కలిగించినా, ఎమోషనల్ సన్నివేశాలు, పాత్రల మధ్య కెమిస్ట్రీ, రాజకీయ నేపథ్యం ఆ లోటును పూడ్చేస్తాయి. ముఖ్యంగా ‘ప్రేమ విఫలమైతే అది ప్రతీకారంగా మారుతుందా?’ అనే ప్రశ్న చుట్టూ సాగే కథ ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది.