గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ట్రిప్పులు పెంచండి.. అధికారులకు ఎండీ ఆదేశం

గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ట్రిప్పులు పెంచండి.. అధికారులకు ఎండీ ఆదేశం

హైదరాబాద్: శుద్ధి చేసిన మురుగునీటి (గ్రీన్ వాటర్) వినియోగాన్ని మరింత విస్తృతం చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులు, గార్డెనింగ్, ల్యాండ్‌స్కేపింగ్ వంటి అవసరాలకు తాగునీటికి బదులుగా శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ మేరకు ఆయన దుర్గం చెరువు మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ), గ్రీన్ వాటర్ ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను పరిశీలించారు. శుద్ధి చేసిన నీటి సరఫరా, ట్యాంకర్ల నిర్వహణ, నీటి నాణ్యత ప్రమాణాలను తనిఖీ చేశారు. గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ట్రిప్పుల సంఖ్యను పెంచి వినియోగదారులకు మరింత విస్తృతంగా నీటిని అందించాలని అధికారులకు సూచించారు.

మైండ్‌స్పేస్, రహేజా సంస్థల ప్రతినిధులతో ఎండీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నిర్మాణ పనులు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు, గార్డెనింగ్, ల్యాండ్‌స్కేపింగ్ అవసరాలకు శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా ప్రోత్సహించాలని సూచించారు. తాగునీటి వనరులపై ఒత్తిడిని తగ్గించేందుకు నిర్మాణ అవసరాలకు గ్రీన్ వాటర్ వినియోగాన్ని పెంచాలని తెలిపారు.జలమండలి పరిధిలోని మూడు రీజియన్లలో గ్రీన్ వాటర్ సరఫరాను విస్తృతం చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ సంస్థలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలకు అవసరమైన మేరకు శుద్ధి చేసిన నీటిని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

ప్రతి మురుగునీటి శుద్ధి కేంద్రం వద్ద నీటి నాణ్యతకు సంబంధించిన వివరాలను ఎల్ఈడీ డిస్‌ప్లే బోర్డుల ద్వారా ప్రదర్శించాలని ఎండీ ఆదేశించారు. బీఓడీ ,సీఓడీ, టీఎస్ఎస్,పీహెచ్ (pH) విలువలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని స్పష్టం చేశారు.నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా మురుగునీటి శుద్ధి జరగాలన్నారు. శుద్ధి చేసిన నీటి నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు.

 

గ్రీన్ వాటర్ ట్యాంకర్ల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ వినియోగాన్ని తప్పనిసరి చేయాలని ఎండీ ఆదేశించారు. ట్యాంకర్ బుకింగ్, ఫిల్లింగ్, రవాణా, డెలివరీ వరకు ప్రతి దశకు సంబంధించిన వివరాలను యాప్‌లో నమోదు చేయాలని సూచించారు.గ్రీన్ వాటర్ వినియోగాన్ని పెంచడం ద్వారా తాగునీటి వనరులను పరిరక్షించడంతో పాటు నీటి వృథాను తగ్గించవచ్చని అశోక్ రెడ్డి తెలిపారు. శుద్ధి చేసిన నీటిని ప్రత్యామ్నాయ అవసరాలకు విస్తృతంగా వినియోగించేలా ప్రజలు, నిర్మాణ సంస్థలు, పరిశ్రమలు ముందుకు రావాలని సూచించారు.