అమరావతి: ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు క్షీణించాయని, పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకే రక్షణ లేకుండా పోతోందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థిని గోపికపై ఎలక్ట్రిక్ రంపంతో జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని జగన్ ఆరోపించారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.50 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గోపికకు అవసరమైన అత్యుత్తమ వైద్య సేవలను ప్రభుత్వ ఖర్చుతో అందించాలని, కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలవాలని కోరారు.
సోమవారం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి వెళ్లిన వైఎస్ జగన్.. చికిత్స పొందుతున్న గోపికను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి బాలిక ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. సుమారు 11 గంటల పాటు జరిగిన క్లిష్టమైన శస్త్రచికిత్సను గోపిక విజయవంతంగా తట్టుకుందని, ప్రస్తుతం చికిత్సకు స్పందిస్తూ కోలుకుంటోందని వైద్యులు తెలిపినట్లు వెల్లడించారు.
అనంతరం ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడిన జగన్.. పాఠశాలతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి ఎలక్ట్రిక్ రంపంతో తరగతి గదిలోకి ప్రవేశించి విద్యార్థినిపై దాడి చేయడం ఆందోళనకరమన్నారు. పాఠశాలల్లోకి బయటి వ్యక్తులు ఆయుధాలతో వస్తున్నా అడ్డుకునే వ్యవస్థ లేకపోవడం భద్రతా లోపాలను తెలియజేస్తోందని ఆరోపించారు.ప్రస్తుత ప్రభుత్వం రూ.50 లక్షల పరిహారం అందించకపోతే, వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. బాలిక వైద్యానికి అవసరమైన సహాయ సహకారాలను పార్టీ తరఫున కూడా అందిస్తామని తెలిపారు.
రాప్తాడు నియోజకవర్గంలో తొమ్మిది ఘటనలు
రాప్తాడు నియోజకవర్గంలో గత 15 నుంచి 16 నెలల కాలంలో తొమ్మిది దారుణ ఘటనలు చోటుచేసుకున్నాయని జగన్ పేర్కొన్నారు. వీటిలో ఆరు మహిళలు, బాలికలకు సంబంధించినవేనని తెలిపారు. గోపికపై దాడితో పాటు అనూష, సావిత్రిబాయి, సావిత్రమ్మ ఘటనలు, 14 ఏళ్ల ఎస్సీ బాలికపై సామూహిక అత్యాచారం, కురువ లింగయ్య, బోయ నాగేష్, నారాయణరెడ్డి హత్యలు, స్పందన ఆత్మహత్య ఘటనలను ప్రస్తావించారు.రాష్ట్రంలో బెల్ట్ షాపులు, గంజాయి, మద్యం విచ్చలవిడిగా అందుబాటులో ఉండటంతో యువత వ్యసనాలకు బానిసలవుతున్నారని విమర్శించారు. వీటిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పోలీసు వ్యవస్థను రాజకీయ వ్యవహారాలకు ఉపయోగించడం వల్ల శాంతిభద్రతల పరిరక్షణపై తగిన దృష్టి సారించడం లేదని అన్నారు.
►ALSO READ | మురసు తుఫాన్ ఎఫెక్ట్..ఏడు జిల్లాలకు భారీ వర్ష సూచన..సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
గోపిక త్వరగా కోలుకోవాలి
గోపిక 11 గంటల పాటు సాగిన క్లిష్టమైన శస్త్రచికిత్సను తట్టుకుని కోలుకుంటుండటం సంతోషకరమని జగన్ అన్నారు. మరో 48 గంటల పాటు బాలిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిశితంగా పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు. గోపిక పూర్తిగా కోలుకుని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ఆకాంక్షించారు.
