నీట్ పీజీ రూల్స్పై సుప్రీం కోర్టు సీరియస్.. వివరణ ఇవ్వాల్సిందిగా NBEMS కు ఆదేశం

నీట్ పీజీ రూల్స్పై సుప్రీం కోర్టు సీరియస్.. వివరణ ఇవ్వాల్సిందిగా NBEMS కు ఆదేశం

నీట్ పీజీ (NEET-PG) పరీక్షల పారదర్శకత, నియమ నిబంధనలపై నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) వైఖరి పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 2026 నవంబర్ 2 న జరిగిన విచారణలో, పరీక్ష రాసిన అభ్యర్థులకు అసలు ప్రశ్నపత్రాలు, సమాధానాలు (Answer Keys)  ఎందుకు వెల్లడించడం లేదని  జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ ఆలోక్ అరాధేలతో కూడిన బెంచ్  సీరియస్ అయింది.

కోర్టు లేవనెత్తిన ప్రధానాంశాలు:

ఇతర పోటీ పరీక్షల మాదిరిగా కాకుండా నీట్ పీజీ విషయంలో ప్రశ్నలు, ఆప్షన్లను దాచడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రాన్స్పరెన్సీ ఏమైంది.. మీరు చేస్తున్న దానికి  వివరణ కావాలి. బోర్డు అనుసరిస్తున్న విధానంపై మాకు సంతృప్తి లేదు అని జస్టిస్ నరసింహ స్పష్టం చేశారు.

ప్రశ్నపత్రాలను, సమాధానాలను పూర్తిగా అభ్యర్థులకు అందుబాటులో ఉంచితే పరీక్షల పవిత్రత ఎలా దెబ్బతింటుందో పూర్తి వివరాలతో లిఖితపూర్వక సమాధానం  దాఖలు చేయాలని NBEMS ను కోర్టు ఆదేశించింది.

NBEMS తరఫు న్యాయవాది వాదన:

 పీజీ వైద్య పరీక్షలకు సంబంధించిన ప్రశ్నల నిధి  చాలా పరిమితంగా ఉంటుందని, అది దేశ సంపద లాంటిదని బోర్డు పేర్కొంది.  గణితం లాగా కాకుండా మెడికల్ సైన్స్‌లో ప్రశ్నలు, సమాధానాలు స్థిరంగా ఉంటాయని.. ప్రతి ఏటా ప్రశ్నలను బయటపెడితే కోచింగ్ సెంటర్లు వాటిని సేకరించి అభ్యర్థులకు బట్టీపట్టేలా చేస్తాయని, దీనివల్ల భవిష్యత్తులో పరీక్షల నాణ్యత దెబ్బతింటుందని సమర్థించుకునే ప్రయత్నం చేసింది.

►ALSO READ | ఎవరు లేకున్నా షాపు ఓపెన్‌గానే ఉంటుంది.. నచ్చినవి తీసుకోని డబ్బులు కట్టొచ్చు ! ఇదే ఈ ఊరు స్పెషాలిటీ!

అయితే, గత ఏళ్ల నాటి ప్రశ్నపత్రాలు అమెజాన్ వంటి సైట్లలో  అమ్మకానికి అందుబాటులో ఉన్నప్పుడు బోర్డు ఎందుకు దాస్తోందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ప్రశ్నించారు. బోర్డు వాదనతో ఏకీభవించని సుప్రీంకోర్టు, తదుపరి విచారణ నాటికి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ కేసును వాయిదా వేసింది