నిన్నTRS..ఇవాళ BRS..రేపు HRS హరీశ్ రాష్ట్ర సమితి : మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

నిన్నTRS..ఇవాళ BRS..రేపు HRS హరీశ్ రాష్ట్ర సమితి : మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్ రావులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. హ్యామ్ రోడ్ల శంకుస్థాపన సందర్భంగా నల్గొండ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. కేవలం ప్రతిరోజూ పేపర్లలో, టీవీల్లో రావాలనే తాపత్రయంతోనే ప్రభుత్వంపై కేటీఆర్,హరీశ్ రావు ఇష్టమొచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు కాళ్లల్లో కట్టెలు పెట్టడమే బీఆర్ఎస్ పనిగా పెట్టుకుందని ధ్వజమెత్తారు.

పూటకో పేరు మార్చడం బీఆర్ఎస్‌కే చెల్లిందని... నిన్న టీఆర్ఎస్, ఇవాళ బీఆర్ఎస్, రేపు అది హెచ్ఆర్ఎస్' అంటే...హరీశ్ రావు రాష్ట్ర సమితిగా మారబోతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి.

గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం, ధరణి పేరుతో వేల కోట్లు దోచుకున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. తాము మూసీ ప్రక్షాళన చేపడుతుంటే కూడా విమర్శలు చేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. ఏసీ రూముల్లో పడుకుని ధర్నాలు చేయడం కాదని... చేతనైతే నకిరేకల్ దగ్గరికి వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. నల్గొండ అంటేనే పోరాటాల గడ్డ అని గుర్తు చేసిన ఆయన... గతంలో నిధుల కోసం కేసీఆర్‌ను కలుద్దామంటే కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. మిషన్ భగీరథ పేరుతో వేల కోట్లు తగలేశారని, ఇవాళ రాష్ట్రంలో ఏ ఊరిలోనూ భగీరథ నీళ్లు రావడం లేదని విమర్శించారు.

►ALSO READ | జనగామ జిల్లాలో సంచలనం!.. ఒకే కేసులో సీఐ, ఎస్ఐని సస్పెండ్ చేసిన వరంగల్ సీపీ

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇల్లు కట్టుకునే పేదలకు రూ. 5 లక్షల సాయం అందిస్తున్నామని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచామని చెప్పారు. హైదరాబాద్ తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉన్న ఏకైక నగరం నల్గొండ మాత్రమేనని స్పష్టం చేశారు. పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనన్నారు.

దేశంలోనే తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి... ప్రయాణికులు క్షేమంగా ఇళ్లకు చేరాలనే లక్ష్యంతోనే రోడ్ల నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి మండల కేంద్రం వరకు డబుల్ రోడ్లు నిర్మిస్తున్నామని... ఏపీలో హ్యామ్ (HAM) రోడ్లకు కేవలం రూ. 300 కోట్లే ఇస్తే, మన తెలంగాణలో ఏకంగా రూ. 6 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 78 వేల కోట్లతో భారీ ఎత్తున రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని... ఈ పనులతో తెలంగాణ రహదారుల రూపురేఖలు మారిపోతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.