అర్ధరాత్రి పాకిస్థాన్ ఊచకోత: అఫ్గాన్ సరిహద్దుల్లో భీకర దాడులు.. 36 మంది మృతి..!

అర్ధరాత్రి పాకిస్థాన్ ఊచకోత: అఫ్గాన్ సరిహద్దుల్లో భీకర దాడులు.. 36 మంది మృతి..!

ఇస్లామాబాద్: ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ మరోసారి విరుచుకుపడింది. ఆదివారం (జూన్ 28) అర్ధరాత్రి ఆప్ఘాన్ సరిహద్దుల్లో పాక్ వైమానిక దళం బాంబుల వర్షం కురిపించింది. పాక్ మెరుపు దాడుల్లో పిల్లలు, వృద్ధులతో సహా 35 మందికి పైగా పౌరులు మరణించారని ఆఫ్ఘన్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఇటీవల కరాచీలోని పాకిస్తాన్ రేంజర్స్ ప్రాంతీయ ప్రధాన కార్యాలయంపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగానే ఈ దాడులు చేపట్టినట్లు పాక్ ప్రకటించింది. ఆప్ఘాన్ కేంద్రంగా పని చేస్తోన్న ఉగ్రవాద సంస్థలే లక్ష్యంగా అటాక్స్ చేసినట్లు స్పష్టం చేసింది. ఈ దాడుల్లో 29 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టినట్లు తెలిపింది. 

చనిపోయినోళ్లంత సాధారణ పౌరులే: ఆప్ఘాన్

ఆప్ఘాన్ కేంద్రంగా పని చేస్తోన్న ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకునే దాడులు చేశామన్న పాక్ ఆరోపణలను ఆప్ఘాన్ తీవ్రంగా ఖండించింది. మానవ నివాస ప్రాంతాలపై పాక్ వైమానిక దళం దాడులు జరిపిందని.. బాధితులు ఉగ్రవాదులు కాదు సాధారణ పౌరులేనని పేర్కొంది. 

పక్తికా ప్రావిన్స్‌లోని జ్ఞాన్, పక్తియా ప్రావిన్స్‌లోని చమ్కానీ, కునార్ ప్రావిన్స్‌లోని మరవారా జిల్లాలలో ఈ దాడులు జరిగినట్లు తెలిపింది. ఈ ఆపరేషన్‌లో ఇళ్లు, మసీదులు కూడా దెబ్బతిన్నాయని వెల్లడించింది. పాక్ బాంబు దాడులలో 36 మంది మరణించగా.. 100 మందికి పైగా గాయపడ్డారని తెలిపింది.  

పాక్ డబుల్-ట్యాప్ దాడులు..!

పాకిస్తాన్ వైమానిక దళం డబుల్ ట్యాప్ దాడులు చేసినట్లు ఆప్ఘాన్ ఆరోపించింది. తొలి బాంబు దాడి జరిగిన కొద్దిసేపటికే రెండో విడత దాడులు జరిగాయని తెలిపింది. దాడుల్లో కూలిపోయిన భవనాల కింద చిక్కుకున్న వారిని రక్షించడానికి గ్రామస్థులు సహయక చర్యలు చేపట్టగా అదే ప్రాంతాలపై రెండోసారి దాడులు జరిగాయని తెలిపింది. దీంతో సహాయక చర్యలు చేపడుతున్న రక్షకులు, పౌరులు కూడా ఈ బాంబు దాడిలో చిక్కుకున్నారని తెలిపింది. ఈ దాడులను ఆఫ్ఘన్ వర్గాలు డబుల్-ట్యాప్ దాడిగా అభివర్ణించాయి. ఈ ఆరోపణలపై పాకిస్థాన్ బహిరంగంగా స్పందించలేదు.