ఇస్లామాబాద్: దాయాది పాకిస్తాన్ దేశం ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందనే విషయం మరోసారి నిరూపితమైంది. పాకిస్థాన్ మాజీ హోం మంత్రి షేక్ రషీద్ అహ్మద్ బహిరంగంగా నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా ఉగ్రవాదులతో వేదిక పంచుకున్నాడు. అంతేకాకుండా వారి సమక్షంలోనే భారత్‌కు వ్యతిరేకంగా తీవ్రమైన బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పాక్ వైపు కన్నెత్తి చూసిన భారత్‌ను నాశనం చేస్తం:
లష్కరే తొయిబా కార్యక్రమంలో పాల్గొన్న పాక్ మాజీ హోం మంత్రి షేక్ రషీద్ అహ్మద్ ఇండియాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ వైపు కన్నెత్తి చూసినా భారత్ ను నాశనం చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. భారత్‌లో పక్షులు కిలకిలలాడవు.. దేవాలయాల్లో గంటలు మోగవని వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు.
పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఏం చేసే ధైర్యం ఇండియాకు లేదని ప్రగల్భాలు పలికాడు. పాకిస్తాన్ ఏం సంక్షోభం ఎదుర్కొన్నా.. దాని వెనక ఇండియా హస్తం ఉంటుందని నిరాధార ఆరోపణలు చేశాడు. అలాగే, ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, ఉగ్రవాద సంస్థ లష్కర్ తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.
తాను హఫీజ్ సయీద్‌కు బానిసని అని అన్నాడు. హఫీజ్ తనకు సోదరుడి లాంటి వాడని చెప్పాడు. తాము ఎల్లప్పుడూ పాకిస్థాన్‌తో పాటు హఫీజ్ సయీద్ వైపే ఉంటామని స్పష్టం చేశారు. గతంలో అమెరికా వెళ్లినప్పుడు తన మొబైల్ ఫోన్‌లో హఫీజ్ సయీద్ ఫోన్ నెంబర్ కనిపించిందనే కారణంతోనే అమెరికా అధికారులు తనను ఆ దేశం నుండి బహిష్కరించారని గుర్తు చేశాడు.
