జర్మనీ నేర్చుకుంటే ఉద్యోగాలు గ్యారంటీ..యువతకు మంత్రి వివేక్ ఆఫర్

జర్మనీ నేర్చుకుంటే ఉద్యోగాలు గ్యారంటీ..యువతకు మంత్రి వివేక్  ఆఫర్

మందమర్రి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన జర్మనీ భాషా శిక్షణ తరగతులను మంత్రి వివేక్ సందర్శించారు. స్వయంగా యువతీ యువకులతో కలిసి కూర్చొని క్లాసులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...జర్మనీ భాష నేర్చుకునేందుకు మన యువత ఎంతో ఆసక్తి చూపుతోంది. పట్టుదల, క్రమశిక్షణతో శిక్షణ పూర్తి చేసుకుంటే జర్మనీలో ఉద్యోగాలు గ్యారంటీ. ప్రస్తుతం జర్మనీ దేశం 5 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉంది. యువత ఈ అవకాశాన్ని వాడుకుని విదేశాల్లో స్థిరపడితే.. తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది. ఈ విషయంలో మందమర్రి రాష్ట్రానికే రోల్ మోడల్‌గా నిలుస్తుందని అన్నారు.

అనంతరం మందమర్రి కార్యాలయంలో BLA-2 లతో సమావేశమైన మంత్రి.. ఓటరు నమోదు ప్రక్రియపై వారికి దిశానిర్దేశం చేశారు. బూత్ లెవెల్‌లో ఓటర్లను గుర్తించి వారికి ఓటు హక్కు కల్పించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్, హరీష్ రావులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు మంత్రి వివేక్.

తెలంగాణను 8 లక్షల కోట్ల అప్పుల్లోకి ఎందుకు నెట్టారో హరీష్ రావు ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి కమిషన్లు దోచుకున్నారే తప్ప... దాని వల్ల ఎవరికీ ప్రయోజనం కలగలేదన్నారు.  గత ప్రభుత్వం సరైన హెల్త్ స్కీమ్‌లు తీసుకురాకపోవడం వల్లే... కోవిడ్ సమయంలో మహిళలు పుస్తెల తాళ్లు తాకట్టు పెట్టి వైద్యం చేయించుకున్నారు. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచాం. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ. 900 కోట్లు అందించి ప్రజా పాలన ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచింది.సింగరేణి కార్మికుల విషయంలో బీఆర్ఎస్ అన్యాయం చేసిందని మంత్రి మండిపడ్డారు. పదేళ్ల కాలంలో లక్ష ఉద్యోగాలను 38 వేలకు కుదించారని ధ్వజమెత్తారు.

గతంలో నస్పూర్ సభలో కేసీఆర్ కార్మికులకు హామీల వర్షం కురిపించారు. మారుపేర్ల సవరణ, సొంతింటి కల, కొత్త గనులు, ఇన్‌కమ్ టాక్స్ మినహాయింపు అంటూ చెప్పి... ఒక్క మాట కూడా నెరవేర్చలేదు. సింగరేణిని ఆర్థికంగా వాడుకుని కార్మికులను ముంచారు. కానీ ఇప్పుడు రెండేళ్లలోనే సింగరేణికి 11 వేల కోట్ల లాభాలు వచ్చాయి. బీఆర్ఎస్ నేతలు ఫ్రస్ట్రేషన్‌లో ఉండి.. కార్మికులను, ప్రజలను మభ్యపెట్టడానికే ధర్నాలు చేస్తున్నారు.