మానవ మృగానికి మరణ శిక్ష: మూడేళ్ల బాలికపై హత్యాచారం కేసులో పుణె కోర్టు సంచలన తీర్పు

మానవ మృగానికి మరణ శిక్ష: మూడేళ్ల బాలికపై హత్యాచారం కేసులో పుణె కోర్టు సంచలన తీర్పు

ముంబై: పోక్సో కేసులో మహారాష్ట్రలోని పుణె జిల్లా ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. మూడేళ్ల బాలికపై అత్యంత క్రూరంగా అత్యాచారం, హత్య చేసిన కేసులో 65 ఏళ్ల వ్యక్తికి మరణశిక్ష విధించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నేరం జరిగిన 60 రోజుల్లోపే ఈ తీర్పు వెలువరించడం గమనార్హం. 

అసలేం జరిగిందంటే..?

పుణె జిల్లాలోని భోర్ తాలూకా నస్రాపూర్ గ్రామంలో 2026, మే 1న యావత్ దేశం దిగ్భ్రాంతికి గురయ్యే ఘటన చోటు చేసుకుంది. ఆడుకోవడానికి తన ఇంటికి వచ్చిన మూడేళ్ల బాలికపై భీమ్రావ్ కాంబ్లే అనే 65 ఏళ్ల వృద్ధుడు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేశాడు. చిన్నారికి తినుబండారాలు ఇస్తానని, ఆవు దూడను చూపిస్తానని ఆశచూపి పశువుల పాక దగ్గరకు తీసుకెళ్లి అక్కడ దారుణానికి ఒడిగట్టాడు. 

బాలికపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా.. నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసి కిరాతకంగా హత్య చేశాడు. బాలిక కనిపించకుండా పోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పరిస్థిర ప్రాంతాల్లో వెతకగా.. భీమ్రావ్ కాంబ్లే పశువుల పాకలో చిన్నారి మృతదేహం లభ్యమైంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై పుణె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కేవలం 16 రోజుల్లోనే 1,200 పేజీల ఛార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నేరం జరిగిన 60 రోజుల్లోపే న్యాయస్థానం ఈ కేసులో తీర్పు వెలువరించింది. నిందితుడు భీమ్రావ్‌కు భారతీయ న్యాయ సంహిత (BNS), పోక్సో (POCSO) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

 ఈ కేసును న్యాయమూర్తి రేరెస్ట్ ఆఫ్ రేర్‎గా అభివర్ణించారు. నిందితుడి ప్రవర్తన మానవత్వానికే మచ్చ తెచ్చేలా, అత్యంత క్రూరంగా ఉందని పేర్కొన్నారు. సమాజంలో ఇటువంటి మృగాలకు క్షమాపణ లేదని.. ఉరిశిక్ష మాత్రమే సరైన న్యాయమని స్పష్టం చేశారు.