తెలంగాణ ప్రజలు బీజేపీ మాటలు నమ్మేంత పిచ్చోళ్ళు కాదు: మహేష్ గౌడ్

తెలంగాణ ప్రజలు బీజేపీ మాటలు నమ్మేంత పిచ్చోళ్ళు కాదు: మహేష్ గౌడ్

హైదరాబాద్: బెంగాల్ మాదిరిగానే తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. సోమవారం (జూన్ 29) నిజామాబాద్‎లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు బీజేపీ మాటలు నమ్మేటంత పిచ్చోళ్ళు కాదని అన్నారు. డబుల్ ఇంజన్ అంటూ బీజేపీ పేద ప్రజలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రోజురోజుకు బీజేపీ ఇంజన్ డౌన్ అవుతోందని ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్‎లో కుట్రపూరితంగా ఓట్లు తొలగించి బీజేపీ గెలిచిందని ఆరోపించారు. తెలంగాణలో బెంగాల్ తరహా చేస్తామంటే కుదరనివ్వమని హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఇపుడున్న సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. 

కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్, కేటీఆర్ చేస్తోన్న విమర్శలు అర్ధరహితమని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తుంగభద్ర అంశంలో ఒప్పందం మీద సంతకం చేసింది హరీష్ రావు కాదా అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎన్ని పన్నగాలు పన్నినా.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతోన్న సంక్షేమం, అభివృద్ధి పనులు చూసే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారన్నారు.