కొందరు దౌర్భాగ్యుల వల్లే  పార్టీ మారిన: బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం హాట్ కామెంట్స్

కొందరు దౌర్భాగ్యుల వల్లే  పార్టీ మారిన: బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం హాట్ కామెంట్స్
  • ఆరు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చిన్రు
  • అప్పుడే నేను జాతీయ జెండా ఉన్న కండువా కప్పుకున్నా
  • సమస్యలు తీరుస్తామన్న మంత్రులు పొంగులేటి, భట్టి, వేం ఫోన్​ లిప్టు చేయడంలేదు
  • బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం హాట్ కామెంట్స్

కామారెడ్డి/బీర్కూర్, వెలుగు: కొందరు దౌర్భాగ్యులు ఇబ్బంది పెట్టడం వలనే తాను పార్టీ మారినట్టు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి చెప్పారు. గతంలో చేపట్టిన వివిధ అభివృద్ది పనులకు రావాల్సిన పేమెంట్స్​తో పాటు, చేపట్టిన పనులు అగిపోకూడదనే పార్టీ మారానన్నారు.

కామారెడ్డి జిల్లా బీర్కూర్​ మండలంలోని మంజీర నది చెక్​డ్యామ్​ వద్ద తన అనుచరులు, నాయకులతో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పొచారం శ్రీనివాస్​రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన మనసు విప్పి అనుచరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం పోతే పార్టీ మారాలనే ప్రతిపాదన తెచ్చారన్నారు. 

‘ఈ వయస్సులో కేసీఆర్​ను మోసం చేసి రావటం నా వల్ల కాదని చెప్పి నెల రోజులు అగాను. ఆ తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఫోన్​ చేశాడు, ఆయన నా ఇంటికి వచ్చాడు ఎస్​డీఎఫ్, డబుల్ బెడ్రూంల బకాయిలు ఇవ్వాలని నిలిచిపోయిన పనులు కొనసాగించాలని కోరాను. మంత్రి వెంటనే సీఎం రేవంత్​రెడ్డితో మాట్లాడించగా.. మరుసటి రోజు స్వయంగా సీఎం వచ్చారు. తనకు పైసలు కానీ, మంత్రి పదవి అక్కర లేదని నియోజక వర్గ సమస్యలు పరిష్కరించాలని కోరాను. ఆరు నెలల్లో పరిష్కరిస్తామని సీఎం హామీ ఇవ్వడంతో కండువా కప్పుకున్నా. అది కూడా జాతీయ జెండానే. చేతి గుర్తు ఉన్న కండువా కప్పుకోలేదు’ అని చెప్పారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సీఎం నిర్వహించిన మీటింగ్​ కు వెళ్లినప్పుడు నియోజకవర్గానికి రావాల్సిన బకాయిలు రెండు విడతల్లో ఇవ్వాలని మంత్రులు పొంగులేటి, భట్టికి సీఎం చెప్పారని, తెల్లారి నుంచి పొంగులేటి, భట్టి ఫోన్లు లిప్టు చేయలేదన్నారు. మరోసారి ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళితే బిల్స్​ రిలీజ్​ చేయించాలని వేం నరేందర్​రెడ్డిని పిలిచి చెప్పారన్నారు. ఆయన కూడా ఫోన్లు లేపలేదని, ఆయనకు కనీసం 50 సార్లు కాల్​ చేశానని ఆవేదన చెందారు. మంత్రి పదవి కోసమో, పైసల కోసమో పార్టీ మారలేదన్నారు. తాను అమ్మడు పోలేదని, అన్నం పెట్టిన వాళ్లను ఎప్పుడు మర్చి పోనని అన్నారు. కేసీఆర్  హయాంలోనే నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందన్నారు.