మంచిర్యాల కేంద్రంగా స్ర్కాప్ మాఫియా.. ఓ వ్యక్తి కీలక సూత్రధారిగా సింగరేణి, రైల్వే సొత్తు మాయం

మంచిర్యాల కేంద్రంగా స్ర్కాప్ మాఫియా.. ఓ వ్యక్తి కీలక సూత్రధారిగా సింగరేణి, రైల్వే సొత్తు మాయం
  •     భారీ నెట్‌‌‌‌వర్క్​ఏర్పాటు చేసుకొని రూ.కోట్లలో ఇల్లీగల్​బిజినెస్​
  •     మూడు రోజుల కింద పట్టపగలే సింగరేణి పైపులు చోరీ
  •     కీలక సూత్రధారి నరేశ్, సింగరేణి సూపర్‌‌‌‌‌‌‌‌వైజర్‌‌‌‌‌‌‌‌తోపాటు
  • ఆరుగురు అరెస్ట్​


మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల కేంద్రంగా బత్తిని నరేశ్​గౌడ్​ అనే వ్యక్తి భారీ స్ర్కాప్​ దందా నడుపుతున్నాడు. ఒకప్పుడు తుక్కుతో ప్రస్థానం ప్రారంభించిన అతడు అన్ని వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకొని మాఫియా స్థాయికి ఎదిగాడు. సింగరేణి, రైల్వే డిపార్ట్‌‌‌‌మెంట్లకు చెందిన టన్నుల కొద్ది ఐరన్​, కాపర్​మాయం చేస్తూ కొద్దిరోజుల్లోనే రూ.కోట్లకు పడగలెత్తాడు. ఇందుకోసం భారీ నెట్​వర్క్‌‌‌‌ ఏర్పాటు చేసుకొని దందా నడిపిస్తున్నాడు. ఇప్పటికే అతనిపై దాదాపు 10 కేసులు ఉండగా, తాజాగా పట్టపగలే సింగరేణి పైపుల చోరీ చేసి మరోసారి జైలుపాలయ్యాడు. ఇలా కేసులు అయినప్పుడల్లా అధికారులను మేనేజ్ చేయడం, ఆపై యథావిధిగా దందా కొనసాగించడం రివాజుగా మారింది. 

దందాలో ఎవరికెంత...?

స్ర్కాప్​ దందా కోసం నరేశ్​గౌడ్​ భారీ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. వారి ద్వారా సింగరేణి, రైల్వే, ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌‌‌‌మెంట్లకు సంబంధించిన ఐరన్, కాపర్‌‌‌‌‌‌‌‌ను దొంగిలించి భారీ మెషిన్లతో తుక్కుగా మార్చేస్తాడు. ఆపై ఎవరికీ అనుమానం రాకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటాడు. సింగరేణి, రైల్వే, పోలీస్, ట్రాన్స్‌‌‌‌పోర్ట్, కమర్షియల్​ట్యాక్స్‌‌‌‌, జీఎస్టీ, ఇన్‌‌‌‌కమ్​ ట్యాక్స్​.. ఇలా దందాతో సంబంధమున్న అన్ని శాఖల అధికారులకు నెల నెలా మామూళ్లు ముట్టజెప్పుతుండడంతో అతని ఆగడాలకు అదుపు లేకుండా పోతోంది. మంచిర్యాల రాళ్లవాగు ఒడ్డున భారీ విస్తీర్ణంలో స్ర్కాప్​ గోదాం ఏర్పాటు చేసి, చుట్టూ ఎత్తైన కాంపౌండ్, బయటివారి కదలికలపై నిఘా పెట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. బయట ఉన్న వ్యక్తులతో మాట్లాడేందుకు వాకీటాకీల వినియోగం వంటివి చూస్తే ఎంత పకడ్బందీగా దొంగ దందా నడుపుతున్నాడో అర్థమవుతుంది. 

చోరీ సొత్తంతా అక్కడికే....

జిల్లాలో ఏ మూలన సింగరేణి, రైల్వే సొత్తు చోరీ జరిగినా అది నరేశ్​గౌడ్​ స్ర్కాప్​ దుకాణానికే చేరుతుంది. ఈ నెల 25న పట్టపగలే శ్రీరాంపూర్​ సింగరేణి స్టోర్స్​నుంచి రూ.4.40 లక్షల విలువైన 110 ఐరన్​ పైపులు దొంగిలించారు. ఈ పైపులను డీసీఎం వ్యాన్‌‌‌‌లో దర్జాగా స్ర్కాప్​ గోడౌన్‌‌‌‌కు తరలిస్తుండగా ఎస్అండ్‌‌‌‌పీసీ అధికారులు మంచిర్యాల ఐబీ చౌరస్తాలో పట్టుకున్నారు. ఇందులో సింగరేణి సివిల్​ సూపర్‌‌‌‌‌‌‌‌వైజర్‌‌‌‌‌‌‌‌ గంగళ్ల సందీప్‌‌‌‌ను ప్రధాన నిందితుడిగా అధికారులు గుర్తించారు. ఇలా పలువురు అధికారులతో నరేశ్​ కుమ్మక్కై రూ.కోట్ల విలువైన సింగరేణి సొత్తును మాయం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. నాలుగేండ్ల కింద అప్పటి రామగుండం పోలీస్‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌ సత్యనారాయణ స్ర్కాప్​ మాఫియాపై ఉక్కుపాదం మోపే క్రమంలో నరేశ్‌‌‌‌ను అరెస్టు చేశారు. పీడీ యాక్ట్​ నమోదు చేయడానికి రంగం సిద్ధం చేసిన కొద్దిరోజులకే ఆయన ట్రాన్స్​ఫర్​ కావడంతో నరేశ్​ దందాను యథేచ్ఛగా సాగుతోంది

ఆరుగురు అరెస్ట్‌‌‌‌  

ఈ నెల 25న జరిగిన సింగరేణి పైపుల చోరీ కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. సింగరేణి సివిల్​ సూపర్‌‌‌‌‌‌‌‌వైజర్​గంగళ్ల సందీప్, ప్రైవేట్​ వర్కర్​ ముప్పు రాజు, డీసీఎం డ్రైవర్​ మహమ్మద్​ హకీమ్​, నస్పూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన తూర్పట జంపయ్య, విలేజ్​శ్రీరాంపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన చింతల సమ్మయ్య, స్ర్కాప్​ డాన్​ బత్తిని నరేశ్​గౌడ్​ ఉన్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చిన అనంతరం రిమాండ్​కు తరలించినట్టు శ్రీరాంపూర్​ సీఐ అశోక్​ తెలిపారు.