హైదరాబాద్ లో హోటళ్లు, రెస్టారెంట్లకు రేటింగ్..90 శాతానికి పైగా  స్కోర్ వస్తే గుడ్ కేటగిరీ

హైదరాబాద్ లో  హోటళ్లు, రెస్టారెంట్లకు రేటింగ్..90 శాతానికి పైగా  స్కోర్ వస్తే గుడ్ కేటగిరీ
  •     ఫుడ్ క్వాలిటీ, కిచెన్ క్లీనింగ్, సర్వింగ్​కూ రేటింగ్ 
  •     90 శాతానికి పైగా  స్కోర్ వస్తే ‘గుడ్ కేటగిరీ’  
  •     50 నుంచి 90 శాతం వస్తే బెటర్​మెంట్​కు నోటీసులు 
  •     50 శాతం కంటే తక్కువొస్తే షోకాజ్

హైదరాబాద్ సిటీ, వెలుగు : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రెస్టారెంట్లు, హోటళ్లు, కేఫ్‌‌ ల పరిశుభ్రతపై రేటింగ్ ఇస్తున్నారు. ఇంతకుముందు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తనిఖీలు చేసి ఉల్లంఘనలు మాత్రమే గుర్తించి నోటీసులు ఇచ్చి ఫైన్లు వేసి వదిలేసేవారు. కానీ, ఇప్పుడు తనిఖీలు చేసి కిచెన్ క్లీన్​గా ఉందా లేదా? డైనింగ్ హాల్ నిర్వహణ ఎలా ఉంది? ఆహార పదార్థాల స్టోరేజీ ఎలా చేస్తున్నారు? ఫెస్ట్​కంట్రోల్, వేస్ట్​మేనేజ్​మెంట్, స్టాఫ్​వ్యక్తిగత పరిశుభ్రత, ఆహార పదార్థాల లేబులింగ్, తాగునీటి లభ్యత వంటి అనేక అంశాలను పరిశీలిస్తున్నారు.

కమిషరేట్​పరిధిలోని రెస్టారెంట్లు, కేఫ్‌‌లు, ఫుడ్ కోర్టులు, ఇతర ఆహార విక్రయ కేంద్రాల్లో కొద్ది వారాలుగా తనిఖీలు చేస్తూ హైజీన్​రేటింగ్​ఇస్తున్నారు. దేశంలో ఫుడ్ టేస్ట్ కు మిషెలిన్ స్టార్ రేటింగ్ ఉన్నట్లు, పరిశుభ్రతకు ప్రత్యేకంగా ఈ విధానాన్ని తీసుకువచ్చారు. ప్రతి విభాగానికి మార్కులు కేటాయించి వాటిని పర్సంటేజ్ రూపంలో మార్చి ఫైనల్ హైజీన్ స్కోర్‌‌ ప్రకటిస్తున్నారు. కస్టమర్లకు క్వాలిటీ ఫుడ్​ఇచ్చేందుకు, రెస్టారెంట్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచడమే లక్ష్యంగా ఈ రేటింగ్​విధానాన్ని తీసుకువచ్చామని సీఎంసీ ఫుడ్​సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. 

90 శాతానిపైగా ఉంటే బెటర్..

ఫుడ్​సేఫ్టీ తనిఖీల్లో 90 శాతానికి పైగా స్కోర్ సాధిస్తే గుడ్ కేటగిరీ రేటింగ్ ఇస్తారు. అంటే అన్ని అంశాల్లో పర్​ఫెక్ట్​గా ఉంటేనే 90 శాతం స్కోర్​వస్తుంది. ఇక 50 నుంచి 90 శాతం మధ్య స్కోర్ వస్తే మెరుగుపర్చుకమని సదరు సంస్థలకు బెటర్​మెంట్​నోటీసులు ఇస్తారు. 50 శాతం కంటే తక్కువ స్కోర్ వస్తే ఏమాత్రం బాగోలేదని షోకాజ్ నోటీసులు జారీ చేసి లోపాల సవరణకు గడువు ఇస్తారు. వినియోగదారుల దృష్టిలో ఈ హైజీన్ రేటింగ్ కీలకంగా మారుతుందని అధికారులు చెప్తున్నారు. ఇన్నిరోజుల పాటు గూగుల్ రేటింగ్ ద్వారా ఏ రెస్టారెంట్ ఎలా ఉందో తెలుసుకుంటున్న కస్టమర్లు..ఇక నుంచి సీఎంసీ ఫుడ్ సేఫ్టీ రేటింగ్ ఆధారంగా రెస్టారెంట్ ఎంత పరిశుభ్రంగా ఉందో కూడా తెలుసుకోవచ్చు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎక్స్ ఖాతాలో రేటింగ్​గురించి తెలుసుకోవచ్చని, తనిఖీలు చేశాక వచ్చిన స్కోర్​ను ఎప్పటికప్పడు పోస్ట్ చేస్తున్నామని చెప్తున్నారు.   

రామేశ్వరం కేఫ్​కు  93 శాతం  

సీఎంసీ ఇప్పటికే నిర్వహించిన తనిఖీల్లో కొన్ని రెస్టారెంట్లు, ఫుడ్ అవుట్‌‌లెట్ల క్లీనింగ్​ను పరిశీలించి మార్కులు కేటాయించింది. ఇందులో అత్యంత తక్కువగా గచ్చిబౌలిలోని రాయల్ స్పైస్ కు కేవలం 18 శాతం హైజీన్ స్కోర్‌‌ మాత్రమే వచ్చింది. మదీనాగూడలోని బహార్ కేఫ్ 40 శాతం, మదీనా గూడ గిస్మత్ మండికి 43 శాతం, కూకట్‌‌ పల్లిలోని స్పైస్ కిచెన్ కు 56 శాతం, పుప్పాల్ గూడలోని కంచి కేఫ్, కొండాపూర్‌‌లోని సబ్‌‌ వే కు 60 శాతం , నల్లగండ్లలోని కోడికూర చిట్టిగారే రెస్టారెంట్ కు 62 శాతం, నిజాంపేట్‌‌లోని పంచెకట్టు దోస, జూబ్లీ ఎన్‌‌క్లేవ్‌‌ లోని లా పినోజ్ పిజ్జా చెరోకు 67 శాతం, కూకట్‌‌ పల్లిలోని బ్రౌన్ బేర్ బేకరీకి 70 శాతం, గచ్చిబౌలిలోని నవాబ్ రెస్టారెంట్ 71 శాతం, హైటెక్ సిటీలోని సెవెన్ సిస్టర్స్ 73 శాతం, మదీనాగూడలోని అంతేరాకు 83 శాతం, ఐనాక్స్ కు 85 శాతం, నిజాంపేట్‌‌లోని కేఎఫ్‌‌సీ కి 86 శాతం స్కోర్ సాధించాయి. ఇక మాదాపూర్ లోని రామేశ్వరం కేఫ్ కి ఏకంగా 93 శాతంతో అత్యున్నత రేటింగ్ వచ్చింది. 

ఆదివారం తనిఖీల్లో బయటపడ్డదిది..

మాదాపూర్/కూకట్​పల్లి, వెలుగు : సైబరాబాద్‌‌లోని ప్రముఖ రెస్టారెంట్లలో సీఎంసీ ఫుడ్ సేఫ్టీ బృందాలు ఆదివారం తనిఖీలు చేశాయి. హైటెక్ సిటీలోని మెహ్‌‌ఫిల్ రెస్టారెంట్‌‌లో వంటగది విశాలంగా లేకపోవడం, తడి నేలపై ఆహార అవశేషాలు కనిపించడం, నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో రూమాలీ రొట్టెల తయారీ కొనసాగుతుండటంతో ఆపేయించారు. కొండాపూర్‌‌లోని పాలమూరు గ్రిల్ బార్ అండ్ రెస్టారెంట్‌‌లో గడువు ముగిసిన మష్రూమ్‌‌ వాడడం, నిల్వ ఆహార పదార్థాలు, వంటగదిలో ఈగలు, పైకప్పు, లైట్లపై జిడ్డు , తుప్పుపట్టిన ఫ్రీజర్‌‌ వాడుతున్నారని గుర్తించారు.

మాదాపూర్‌‌ ఐడియల్ కిచెన్‌‌లో మూతలు లేకుండా నిల్వ చేసిన పిండి పదార్థాలపై చనిపోయిన బొద్దింకలు కనిపించాయి. మినప్పప్పులోనూ కీటకాలు గుర్తించారు. ఇక రాయదుర్గంలోని షా ఘౌస్ రెస్టారెంట్‌‌ కిచెన్​లో ఈగలతో పాటు మాంసాన్ని కట్​చేసే చోట అపరిశుభ్ర పరిస్థితులు, తెరిచి ఉన్న డ్రైన్లు, పేరుకుపోయిన ఆహార వ్యర్థాలు కనిపించాయి. ఇక్కడ గోడలపై గుట్కా మరకలను గుర్తించారు. కూకట్​పల్లిలోని కేఎస్​బేకర్స్​కిచెన్​పరిశుభ్రంగా లేకపోవడం, ఫ్రీజర్​లో వెజ్​, నాన్​వెజ్​కలిపి నిల్వ చేయడం, బొద్దింకలు, తుప్పు పట్టిన ఓవెన్లు, మురికిగా ఉన్న టైల్స్​గుర్తించారు.  నిర్వాహకులకు షోకాజ్​ నోటీసులు జారీ చేశారు.