- ఒకేసారి మూడు రకాల విధులు కేటాయింపు
- ఇటు సెంటర్ నిర్వహణ.. అటు పోలియో, బీఎల్‌వో బాధ్యతలు
- తమ పనే చేయాలని అధికారుల ఒత్తిడి.. ఏది చేయాలో తేల్చుకోలేని పరిస్థితి
- క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేక సిబ్బంది ఆగమాగం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అంగన్‌వాడీ టీచర్ల పరిస్థితి కత్తి మీద సాములా మారింది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించే వీరు.. ఇప్పుడు అదనపు విధులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒకే సమయంలో అంగన్‌వాడీ సెంటర్ల నిర్వహణ, పల్స్ పోలియో కార్యక్రమం, మరోవైపు ఓటర్ల జాబితా సవరణ కోసం బీఎల్‌వో విధులు రావడంతో ఏ పని చేయాలో తెలియక సతమతమవుతున్నారు. అటు ఐసీడీఎస్, ఇటు రెవెన్యూ శాఖ మధ్య నలిగిపోతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే.. సర్ ప్రక్రియ ప్రారంభమైనది. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, వీఓఏలు, ఇతర ఉద్యోగులను బీఎల్‌వోలుగా నియమించారు. దీంతో వారు తమ సొంత బాధ్యతల్లో కొనసాగుతూ అదనంగా సర్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో ఏ సమయంలో ఇంటింటి సర్వే చేపట్టాలి? లేదంటే రోజువారీ బాధ్యతల్లో కొనసాగుతూ ఈ ప్రక్రియలో పాల్గొనాలా? అన్న దానిపై స్పష్టత లేక ఇబ్బందులు పడుతున్నారు.
ఒక టీచర్.. మూడు రకాల విధులు
రాష్ట్రంలో సర్ ప్రక్రియ జూన్ 25 నుంచి
ప్రారంభమైంది. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కూడా మొదలైంది. ఆదివారం బూత్ లెవల్‌లో ఉంటే.. సోమ, మంగళవారం వివిధ శాఖల సమన్వయంతో.. ఇంటింటికి తిరిగి అంగన్‌వాడీలు వ్యాక్సినేషన్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే, సరిగ్గా ఇదే సమయంలో ఓటర్ల జాబితా సవరణ కోసం బీఎల్‌వో విధులకు హాజరు కావాలని రెవెన్యూ అధికారులు హుకుం జారీ చేస్తున్నారు.
ఉదయం పూట అంగన్‌వాడీ సెంటర్లు తెరిచి ఉండాలని, ఐసీడీఎస్ అధికారులు ఒత్తిడి తెస్తుంటే.. బయట తిరిగి ఓటర్ల ఎన్యుమరేషన్ పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ, పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొనాలని అధికారులు ఏకకాలంలో ఒత్తిడి తెస్తున్నారు. అధికారులు ఎవరికి వారు తమ పనే ముఖ్యమని మొండికేయడంతో ఎటు వెళ్లాలో తెలియక టీచర్లు ఆందోళన చెందుతున్నారు. విధులకు గైర్హాజరైతే షోకాజ్ నోటీసులు ఇస్తామని, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని క్షేత్రస్థాయిలో బెదిరింపులు వస్తుండటంతో చివరకు అనారోగ్యంతో ఉన్నవారు కూడా డ్యూటీలు చేయాల్సిన దుస్థితి నెలకొందని వారు వాపోతున్నారు.
సెంటర్లు మూసివేయాల్సిన పరిస్థితి..
రాష్ట్రంలో 20 వేల మంది అంగన్‌వాడీ సిబ్బంది ప్రస్తుతం బీఎల్‌వో విధుల్లో ఉన్నట్లు సమాచారం. వీరిలో చాలా చోట్ల టీచర్లు ఉంటే హెల్పర్లు, హెల్పర్లు ఉంటే టీచర్లు లేని పరిస్థితి ఉన్నది. బీఎల్‌వో పనుల కోసం బయటకు వెళ్తుండటంతో కొన్ని చోట్ల సెంటర్లు మూసివేయాల్సిన పరిస్థితి ఉందని టీచర్లు చెబుతున్నారు. ఫలితంగా చిన్నారుల ఆహారం పెట్టడం, ఎదుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, బాలామృతం పంపిణీ సేవలకు ఆటంకం కలుగుతోంది. మరోవైపుఆరోగ్యలక్ష్మి పథకం కింద గర్భిణులు, బాలింతలకు అందాల్సిన భోజనం, పాలు, గుడ్ల పంపిణీకి కూడా అంతరాయం కలుగుతోంది. ముఖ్యంగా 3 నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలకు అందాల్సిన ప్రీ-స్కూల్ బోధనపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ప్రస్తుతం కొత్త అడ్మిషన్ల సమయం కావడంతో, సెంటర్లు మూసి ఉండటం చూసి తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు వెనుకాడుతున్నారని, పౌష్టికాహారం కోసం వచ్చే లబ్ధిదారులు టీచర్లను నిలదీస్తున్నారని పేర్కొంటున్నారు.
