పర్భణి(మహారాష్ట్ర): ఇటీవల ఏక్‌నాథ్ షిండే వర్గంలో చేరిన తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీలను వెంటనే అనర్హులుగా ప్రకటించాలని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాక్రే డిమాండ్ చేశారు. ఈ ఫిరాయింపులు ఒక పెద్ద రాజకీయ కుట్రలో భాగమని ఆయన ఆరోపించారు. మరాఠ్వాడా పర్యటనలో భాగంగా జరిగిన బహిరంగ సభల్లో థాక్రే మాట్లాడుతూ.. బీజేపీ కేంద్ర నాయకత్వం తమ రాష్ట్ర నాయకుల ప్రాముఖ్యతను తగ్గించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.
రామ మందిర నిధుల దుర్వినియోగంపై మండిపడ్డ ఉద్ధవ్.. బీజేపీని ‘బాబర్ జనతా పార్టీ’గా అభివర్ణించారు. ఆరుగురు ఎంపీల ఫిరాయింపులు ‘ఆపరేషన్ దేవేంద్ర’లో భాగమని, ఇది దేవేంద్ర ఫడ్నవీస్‌ను పక్కన పెట్టేందుకు జరుగుతున్న రాజకీయ క్రీడ అని ఆరోపించారు. చట్టాన్ని గౌరవించి సదరు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరారు. మహారాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా బీజేపీ వ్యవహరిస్తోందని, దీనిని అడ్డుకోవాలని
పార్టీ కార్యకర్తలకు ఉద్ధవ్ పిలుపునిచ్చారు.
