బీసీ గురుకులాల్లో డిజిటల్ విద్య..వంద  స్కూళ్లు, కాలేజీల్లో  కంప్యూటర్ ల్యాబ్‌‌ల ఏర్పాటు

బీసీ గురుకులాల్లో డిజిటల్ విద్య..వంద  స్కూళ్లు, కాలేజీల్లో  కంప్యూటర్ ల్యాబ్‌‌ల ఏర్పాటు
  • స్టూడెంట్స్‌‌కు కంప్యూటర్ పరిజ్ఞానం, డిజిటల్ స్కిల్స్, కోడింగ్ 
  • సీఎస్‌‌ఆర్‌‌‌‌లో కొన్ని స్కూళ్లకు కంప్యూటర్లు అందజేసిన సాఫ్ట్‌‌వేర్ కంపెనీలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీసీ  గురుకుల విద్యార్థులకు టెక్నికల్ ఎడ్యేకేషన్‌‌ను మరింత చేరువ చేసేందుకు తెలంగాణ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌‌స్టిట్యూషన్స్ సొసైటీ కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా గురుకుల విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా, విడతల వారీగా మొత్తం 150 బీసీ గురుకుల విద్యాసంస్థల్లో అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్‌‌లను ఏర్పాటు చేయాలని సొసైటీ నిర్ణయించింది. మొత్తం 150 ల్యాబ్‌‌ల లక్ష్యంలో భాగంగా... ఈ అకడమిక్ ఇయర్‌‌‌‌లో 100 బీసీ గురుకుల స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో కొత్తగా కంప్యూటర్ ల్యాబ్‌‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు. 

డిజిటల్ బోర్డులతో ‘స్మార్ట్’ బోధన

కంప్యూటర్ ల్యాబ్‌‌ల ఏర్పాటుతో పాటు, ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల కోసం బోధనా పద్ధతుల్లో సొసైటీ విప్లవాత్మక మార్పులు ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా బీసీ జూనియర్ కాలేజీల్లో డిజిటల్ క్లాస్ రూమ్‌‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ డిజిటల్ బోర్డుల ద్వారా క్లిష్టమైన సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులను విజువల్స్, త్రీడీ యానిమేషన్ల రూపంలో విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించే వీలుంటుంది. ఇది ఇంటర్ విద్యార్థులు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలైన జేఈఈ, నీట్ వంటి వాటికి సిద్ధమవడానికి ఎంతగానో దోహదపడుతుంది. ప్రస్తుత డిజిటల్ యుగంలో గ్రామీణ, పేద వర్గాలకు చెందిన బీసీ విద్యార్థులు సాంకేతికంగా వెనుకబడిపోకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సొసైటీ అధికారులు చెబుతున్నారు. 

బీసీ గురుకులాలకు అండగా సాఫ్ట్‌‌వేర్ కంపెనీలు, ఎన్జీవోలు 

బీసీ గురుకులాలకు పలు ప్రముఖ సాఫ్ట్‌‌వేర్ కంపెనీలు అండగా నిలుస్తున్నాయి.  కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ సీఎస్ఆర్‌‌‌‌లో భాగంగా కంప్యూటర్లు, కంప్యూటర్ ల్యాబ్‌‌ల ఏర్పాటుకు ఆర్థిక సాయం అందచేస్తోంది. ఇప్పటి వరకు కాగ్నిజెంట్ కంపెనీ 650 కంప్యూటర్లు బీసీ గురుకుల స్కూళ్లు, కాలేజీలకు సీఎస్‌‌ఆర్‌‌‌‌లో ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. డిజిటల్ పరికరాలపై ఆధారపడకుండా విద్యార్థులలో కంప్యూటేషనల్ థింకింగ్ (కంప్యూటర్ ఆలోచనా విధానం)  సమస్యల పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడానికి కాగ్నిజెంట్ అసోసియేట్స్ గత నాలుగు నెలలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.  ఇందులో భాగంగా  17 విద్యాసంస్థల విద్యార్థులకు మెంటార్‌‌‌‌షిప్ అందిస్తున్నారు. వీటిలో 9 సంస్థలు బీసీ గురుకులానికి చెందినవి ఉన్నాయి.

ఇందులో లాజిక్ బిల్డింగ్ అల్గారిథమిక్ థింకింగ్‌‌పై ప్రత్యేక దృష్టి సారించారు. విద్యాశాల ఇంటర్నేషనల్ అనే ఎన్జీవో  సైన్స్, టెక్నాలజీ రంగాలలో  గర్ల్స్ స్టూడెంట్స్‌‌కు స్కిల్స్ పెంచేందుకు ట్రైనింగ్ ఇస్తోంది. ఈ కార్యక్రమాన్ని10 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో అమలు చేస్తోంది. ఈ కళాశాలలకు ల్యాప్‌‌టాప్‌‌లను పంపిణీ చేయడంతో పాటు, ఎంపిక చేసిన 20 మంది విద్యార్థినులకు వారి విద్యా అవసరాల కోసం స్కాలర్‌‌‌‌షిప్ అందిస్తున్నారు.

సికింద్రాబాద్  హయాత్‌‌నగర్‌‌లోని గర్ల్స్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రాక్టికల్ లెర్నింగ్ కోసం ల్యాబొరేటరీలను ప్యూర్ అనే సంస్థ  ఏర్పాటు చేసింది. వర్గల్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్‌‌కు 20 ల్యాప్‌‌ట్యాప్‌‌లను అందచేసింది. వీటితో పాటు నిర్మాణ్ అనే ఎన్జీవో, అమెరికాకు చెందిన సిటిజన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్ విద్యార్థులకు ఆధునిక పరికరాలతో కూడిన ప్రాక్టికల్ లెర్నింగ్  పరిశోధనా సామర్థ్యాలను మెరుగుపరచడానికి బీసీ గురుకులాల్లో  అత్యాధునిక ల్యాబొరేటరీని స్థాపించడానికి  ముందుకు వచ్చాయి. ది గర్ల్ ఫౌండేషన్ బీసీ గురుకుల గర్ల్స్‌‌కు శానిటరీ నాప్  కిన్స్  అందించేందుకు బీసీ సొసైటీతో ఎంవోయు కుదుర్చుకుంది. ఈ అకడమిక్ ఇయర్ లో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఒక్కో ల్యాబ్‌‌కు10 లక్షల వ్యయం

ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం, సొసైటీ భారీగానే నిధులను కేటాయిస్తోంది. ఒక్కో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుకు సుమారు 10 లక్షల రూపాయలను వెచ్చించనున్నారు. ఈ నిధులతో ల్యాబ్‌‌లలో అత్యాధునిక కంప్యూటర్ సిస్టమ్స్, హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, యూపీఎస్ బ్యాకప్, విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండే ఫర్నిచర్‌‌ను సమకూర్చనున్నారు. ల్యాబ్‌‌లలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా కంప్యూటర్ ఇన్‌‌స్ట్రక్టర్లను కూడా అందుబాటులో ఉంచనున్నారు.