యాదగిరిగుట్టకు ఒక్కరోజే రూ. 53 లక్షల ఆదాయం

యాదగిరిగుట్టకు ఒక్కరోజే రూ. 53 లక్షల ఆదాయం
  •     భక్తులతో కిటకిటలాడినఆలయ పరిసరాలు
  •     ఉచిత దర్శనానికి మూడు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది.  హైదరాబాద్ సహా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. రద్దీ కారణంగా లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, పార్కింగ్ ఏరియా, బస్ బే ప్రాంగణం, దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి ఉచిత దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ‌‌ దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు.

ఆలయంలో నిర్వహించిన స్వామి వారి నిత్యకల్యాణం, సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం పూజల్లో  భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు జరిపిన పలు రకాల పూజలు నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.53,08,300 ఆదాయం సమకూరింది. అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.15,51,450, వీఐపీ దర్శన టికెట్ల ద్వారా రూ.11.58 లక్షలు, కొండపైకి వాహనాల ప్రవేశం ద్వారా రూ.6,84,500, బ్రేక్ దర్శనాలతో రూ.5,78,700 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.