మల్కాజ్‌గిరి, వెలుగు: హైదరాబాద్ నేరెడ్‌మెట్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూంను వాహనదారులు ఆదివారం ముట్టడించారు. ఈ సందర్భంగా షోరూంలో సర్వీసింగ్ సదుపాయం కూడా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్కూటర్ల అమ్మకాలపై దృష్టి పెడుతున్న యాజమాన్యం, వాటిలో వచ్చే సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
రూ.లక్షలు పెట్టి కొన్ని ఈవీ స్కూటర్లలో సాంకేతిక లోపాలు, బ్యాటరీ, సాఫ్ట్‌వేర్‌లో సమస్యలు వస్తున్నాయని, వాటిని పరిష్కరించేందుకు కనీసం సర్వీసింగ్ సదుపాయాలు కూడా లేదన్నారు. సమస్యలను పరిష్కరించుకుందామని నేరేడుమెట్ షోరూంకి వస్తే.. ఇక్కడ కేవలం వాహనాల అమ్మకాలు (సేల్స్) మాత్రమే ఉంటాయని, సర్వీసింగ్ సదుపాయం లేదని సిబ్బంది బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసినా స్పందన లేదన్నారు. నిబంధనలు పాటించని షోరూంల లైసెన్సులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్నవారితో మాట్లాడారు. షోరూం యాజమాన్యంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో వాహనదారులు ఆందోళన విరమించారు.
