బోడుప్పల్‎లో గృహప్రవేశ వేడుకలో తాగుబోతుల వీరంగం.. రణరంగంగా మారిన కాలనీ

బోడుప్పల్‎లో గృహప్రవేశ వేడుకలో తాగుబోతుల వీరంగం.. రణరంగంగా మారిన కాలనీ

మేడిపల్లి, వెలుగు: కొత్తింట్లో గృహప్రవేశం చేసుకుని బంధువులతో సంతోషంగా గడుపుతున్న కుటుంబంపై మద్యం మత్తులో వచ్చిన వ్యక్తి దాడికి పాల్పడడంతో కాలనీ రణరంగంగా మారింది. మేడిపల్లి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్​నగర్‎కు చెందిన శ్యామ్‌‌రావు, బోడుప్పల్‎లోని దేవేందర్‌‌నగర్‌‌లో ఇటీవల ఇల్లు కొనుగోలు చేసి శనివారం గృహప్రవేశం నిర్వహించాడు. 

రాత్రి కుటుంబ సభ్యులు, బంధువులు ఇంటి బయట కూర్చొని మాట్లాడుకుంటుండగా, పక్కనే ఉన్న బెల్ట్ షాప్ వద్ద మద్యం సేవించిన స్థానికుడు యాకయ్య అక్కడికి వచ్చి మత్తులో కొత్త ఇంటి వారితో వాగ్వాదానికి దిగాడు. దీంతో కొత్తింటి వారు, బంధువులు యాకయ్యను అడ్డుకుని బయటకు పంపించారు. ఈ విషయాన్ని యాకయ్య తన కొడుకుకు చెప్పడంతో, అతడు తన స్నేహితులతో కలిసి వచ్చి గృహప్రవేశం జరుగుతున్న ఇంటిపై దాడి చేశాడు. 

ఇంటి కిటికీ అద్దాలు, ఫర్నిచర్‌‌తో పాటు ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. గొడవ వద్దని చెప్పిన పక్కింటి వ్యక్తిపై కూడా దాడి చేసి, అతని కారు, బైకులను ధ్వంసం చేశారు. ఘటన మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అవుతోందని గుర్తించిన దుండగులు కెమెరాలను రాళ్లతో పగులగొట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు, బంధువులు ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు, నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. దేవేందర్‌‌నగర్ కాలనీలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయని కాలనీ అధ్యక్షుడు చిన్నం గణేశ్​ఆరోపించారు. వాటిపై ఫిర్యాదు చేసిన వారిపై బెల్ట్ షాప్ నిర్వాహకులు దాడులకు పాల్పడుతున్నారని వాపోయారు.