నిన్నమెున్నటి వరకూ బంగారం ఇంక దొరకదా అన్నట్లుగా రేట్లు ఎంత ఉన్నా కానీ జనం ఎగబడి కొన్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొనసాగింది. కానీ ప్రధాని మోడీ ఆంక్షల ప్రకటనతో పాటు అంతర్జాతీయ మారిన పరిణామాలతో ప్రస్తుతం సీన్ రివర్స్ అయిపోయింది. దీంతో హైదరాబాద్ సిటీలో కూడా సేల్స్ భారీగా తగ్గాయని వ్యాపారులు మెురపెట్టుకుంటున్నారు. ఈ పరిస్థితికి అసలు కారణాలు ఏంటో పరిశీలిద్దాం రండి..
దేశంలోనే అత్యధిక కొనుగోలు శక్తి గల నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌లో కూడా బంగారం, వెండి అమ్మకాలు గత కొద్ది నెలలుగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ధరలు ఆల్‌టైమ్ హై రికార్డులకు చేరడంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కొనుగోళ్లు ఊహించని విధంగా తగ్గాయి. ప్రస్తుతం ధరలు కొంత మేర తగ్గుముఖం పట్టినప్పటికీ, మార్కెట్‌లో ఇంకా స్తబ్ధత కొనసాగుతోందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లోని ప్రధాన మార్కెట్ల(ప్యాట్నీ, జనరల్ బజార్, సోమాజిగూడ, కూకట్‌పల్లి, పంజాగుట్ట, అమీర్ పేట, దిల్‌షుఖ్ నగర్, మెహిదీపట్నం, బషీర్ బాగ్, అబిడ్స్, కోఠి)లో పెద్ద ఎత్తున గోల్డ్ షోరూమ్‌లు ఉన్నాయి. సాధారణ రోజుల్లో నగర వ్యాప్తంగా రోజుకు సగటున 150 నుంచి 200 కిలోల వరకు బంగారం ఆభరణాలు, కాయిన్స్ రూపంలో అమ్ముడవుతుంటుంది. అలాగే 1.5 నుంచి 2 టన్నుల వరకు వెండి విక్రయాలు జరుగుతాయి. ధరలు విపరీతంగా పెరగడం, ఆపై మార్కెట్‌లో తీవ్ర ఒడుదొడుకులు నెలకొనడంతో ప్రస్తుతం రోజువారీ అమ్మకాలు 35 శాతం నుంచి 40 శాతం వరకు పడిపోయాయి. సాధారణంగా పెళ్ళిళ్లు, పండగల సీజన్ (ఉగాది, బోనాలు, అక్షయ తృతీయ) ఉన్న నెలల్లో హైదరాబాద్‌లో నెలకు 4 నుంచి 5 టన్నుల బంగారం, దాదాపు 40 నుంచి 50 టన్నుల వెండి వ్యాపారం జరుగుతుంది. సాఫ్ట్‌వేర్, ఫార్మా రంగాల విస్తృతితో నగరంలో కొనుగోలు శక్తి ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. అయినా, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అత్యవసరమైన పెళ్ళిళ్ల కస్టమర్లు మినహా, సాధారణ కొనుగోలుదారులు మాత్రం మార్కెట్‌కు రావడానికి సంకోచిస్తున్నారు.
డిజిటల్ గోల్డ్ వైపు మొగ్గు..
గతంలో బంగారం కొని లాకర్లలో దాచుకునే వాళ్లు. వీటి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్దగా ఉపయోగం ఉండదు. అందుకే యువత, ఇన్వెస్టర్లు ఇప్పుడు డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్‌ల వైపు మళ్లుతున్నారు. ఫోన్‌పే, పేటీఎం వంటి ఫిన్‌టెక్ యాప్‌ల ద్వారా కేవలం రూపాయి నుంచి కూడా బంగారం కొనే సదుపాయం ఉండటంతో 20 నుంచి 35 ఏళ్ల వయసు గల యువత డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం గత ఏడాది డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లు 69 శాతం పెరిగి 13.5 టన్నులకు చేరాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 1.45 లక్షల వద్ద ఉంది. రాబోయే 6 నెలల్లో మార్కెట్‌లో ఈ ధర తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ధర రూ. 1.33 లక్షలకు లేదా అత్యంత అనుకూల పరిస్థితుల్లో రూ. 1.26 లక్షల వరకు దిగిరావచ్చని అంటున్నారు.
