గ్రేటర్ హైదరాబాద్ లో రోజుకు 20 ప్రమాదాలు..యూటర్న్స్‌‌, నో ఎంట్రీ, వన్‌‌వే, ఫ్లై ఓవర్స్ దగ్గరే ఎక్కువ

 గ్రేటర్ హైదరాబాద్ లో రోజుకు  20 ప్రమాదాలు..యూటర్న్స్‌‌, నో ఎంట్రీ, వన్‌‌వే,  ఫ్లై ఓవర్స్ దగ్గరే ఎక్కువ

రాంగ్ సైడ్‌‌ డ్రైవింగ్‌‌డేంజర్‌‌  ‌‌బెల్స్ మోగిస్తోంది.  షార్ట్‌‌ కట్​అంటూ రాంగ్‌‌ రూట్‌‌లో  డ్రైవ్  చేస్తున్న వాహనదారులు వారితో పాటు ఎదుటి వారి ప్రాణాలను బలిగొంటున్నారు. యూటర్న్‌‌లను తప్పించుకునేందుకు అడ్డదారిలో వెళ్తు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు.

ప్రస్తుతం బయట కాలుపెడితే క్షేమంగా ఇంటికి చేరుకోవడం అనుమానంగా మారింది. వాహనదారులు అడ్డగోలుగా ట్రాఫిక్‌‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ  తమతోపాటు ఎదుటి వారి ప్రాణాలు తీస్తున్నారు.   హైదరాబాద్  ఔటర్ రింగ్‌‌రోడ్డు సహా గ్రేటర్ పరిధిలోని నాలుగు కమిషనరేట్ల పరిధిలో ప్రతిరోజూ సగటున 10 నుంచి 20 వరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.  కనీసం ఇద్దరు, ముగ్గురు మృత్యువాత పడుతున్నారు. పదుల సంఖ్యలో గాయాలపాలవుతున్నారు.  సిటీ రోడ్లపై జరుగుతున్న రాంగ్‌‌ సైడ్‌‌ డ్రైవ్ ప్రమాదాల్లో ఎక్కువగా యూ టర్న్‌‌ల వద్దే ఉంటున్నాయని  పోలీసులు గుర్తించారు. రాంగ్‌‌ సైడ్‌‌ డ్రైవింగ్‌‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్న  ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపట్టినట్లు ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. ఈ మేరకు సిటీ కమిషనరేట్ పరిధిలో గతేడాది 6.7 లక్షల రాంగ్‌‌ సైడ్‌‌ డ్రైవింగ్‌‌ కేసులు నమోదు చేసినట్లు చెప్తున్నా వాహనదారుల తీరులో మార్పు రావడం లేదు.

యూటర్న్స్‌‌, నో ఎంట్రీ, వన్‌‌వే,
 ఫ్లై ఓవర్స్ దగ్గరే ఎక్కువ.. 

హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా 61 ప్రాంతాల్లో రాంగ్‌‌రూట్‌‌ డ్రైవింగ్‌‌ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు గల కారణాలను పరిశీలించారు. ఇలాంటి ప్రాంతాల్లో వన్‌‌వే, సిగ్నల్స్, యూటర్న్స్‌‌, ఫ్లై ఓవర్స్ కింద, నో ఎంట్రీ రూట్‌‌లో ఎక్కువగా రాంగ్ రూట్‌‌ డ్రైవింగ్‌‌ చేస్తున్నట్లు గుర్తించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ కారిడార్‌‌, అండర్ పాస్‌‌, ఫ్లై ఓవర్స్‌‌ సహా ఎక్కువ దూరం యూ టర్న్స్‌‌ ఉన్న రోడ్లపై వాహనదారులు రాంగ్ రూట్‌‌, ఆపోజిట్‌‌రూట్‌‌లో ట్రావెల్‌‌చేస్తున్నారు. మెహదీపట్నం ప్రాంతంలో నూ ఇదే పరిస్థితి ఉంది. మెహదీపట్నం, మసాబ్​ట్యాంక్​ మధ్య సుమారు 2 కిలోమీటర్ల వరకు ఎలాంటి యూటర్న్​ లేకపోవడమే ఇందుకు కారణమని చెప్తున్నారు.

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని నేషనల్ హైవేస్ పైనా ఇదే పరిస్థితి ఉంది. శివారు ప్రాంతాల్లోని సర్విస్ రోడ్స్‌‌,ఫ్లై ఓవర్స్‌‌,సిగ్నల్ టైమింగ్‌‌ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా రాంగ్ సైడ్​ డ్రైవింగ్‌‌ చేస్తున్నట్లు పోలీసుల పరిశీలనలో తేలింది.  రాష్ట్రవ్యాప్తంగా నేషనల్​, స్టేట్​ హైవేస్​పై ప్రతిరోజూ రాంగ్​సైడ్​డ్రైవింగ్​వల్ల పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నా అటు రవాణాశాఖ అధికారులుగానీ, ఇటు పోలీసులు గానీ కంట్రోల్​చేయలేకపోతున్నారు. సరిపడా మ్యాన్​పవర్​ లేకపోవడమే ఇందుకు కారణమంటున్నారు. ప్రస్తుతం రాంగ్​ సైడ్​ డ్రైవింగ్​చేస్తున్నవారికి చిన్నచిన్న జరిమానాలతో సరిపెడ్తున్నామని, అలాకాకుండా వాహనాలను సీజ్​చేయడంతోపాటు ఏడాది వరకు జైలు శిక్షలు విధించడం లాంటి కఠిన చర్యలు తీసుకుంటేనే పరిస్థితిలో మార్పు వస్తుందని అధికారులు చెప్తున్నారు.