తక్షణమే దాడులు నిలిపేస్తున్నం: అమెరికా, ఇరాన్ కీలక నిర్ణయం

 తక్షణమే దాడులు నిలిపేస్తున్నం: అమెరికా, ఇరాన్ కీలక నిర్ణయం

వాషింగ్టన్: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ అమెరికా, ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. తక్షణమే పరస్పరం దాడులు ఆపాలని ఇరుదేశాలు డిసైడ్ అయ్యాయి. మిలిటరీ కార్యకలాపాలను నిలిపేసేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. అపరిష్కృతంగా ఉన్న హార్మూజ్ జలసంధి అంశంపై 2026, జూలై 1న దోహా వేదికగా చర్చించాలని సూత్రప్రాయంగా నిర్ణయించాయి. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడినట్లైంది. 

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. రెండో రోజూ ఇరాన్, అమెరికా మధ్య దాడులతో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. శనివారం హార్మూజ్ జలసంధి గుండా వెళుతున్న మరో చమురు రవాణా నౌకపై ఇరాన్ దాడి చేయడంతో అమెరికా కూడా ఇరాన్‌‌లోని డ్రోన్, మిసైల్, రాడార్ సైట్‌‌లపై రాత్రి పూట మిసైళ్లతో విరుచుకుపడింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఆదివారం కువైట్, బహ్రెయిన్‌‌లోని అమెరికా బేస్‌‌లపై డ్రోన్, మిసైల్ అటాక్స్ చేసింది. ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఈ దాడులతో ప్రమాదంలో పడినట్టయింది. 

హార్మూజ్ జలసంధిలో సుమారు రెండు మిలియన్ బారెళ్ల ముడి చమురును తీసుకెళుతున్న పనామా జెండా గల ‘కికు’ అనే ట్యాంకర్‌‌పై ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో ఆ నౌక ధ్వంసమైంది. నౌకలోని సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడ్డారు. అయితే, శుక్రవారం అమెరికా జరిపిన దాడుల తర్వాత ఇరాన్‌‌కు కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించే అవకాశం ఇచ్చామని, కానీ శనివారం ఉదయం 'కికు' నౌకపై డ్రోన్ దాడి చేయడం ద్వారా ఇరాన్ దళాలు ఆ అవకాశాన్ని వదులుకున్నాయని అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొంది. 

తాజా ప్రతీకార దాడుల్లో ఇరాన్‌‌కు చెందిన నిఘా మౌలిక సదుపాయాలు, సమాచార వ్యవస్థలు, వైమానిక రక్షణ స్థావరాలు, డ్రోన్ నిల్వ సౌకర్యాలు, మైన్‌‌ లేయర్ బేస్‌‌తో సహా 10 స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్టు వెల్లడించింది. కాగా, హార్మూజ్ గుండా వెళుతున్న ఒక సరుకు రవాణా నౌకపై ఇరాన్ దాడి చేసిందనే ఆరోపణలతో, శుక్రవారం కూడా అమెరికా ఇరాన్ క్షిపణి, డ్రోన్ నిల్వ ప్రాంతాలను, తీరప్రాంత రాడార్ సైట్‌‌లపై దాడి చేసింది. దీనికి బదులుగా ఖతార్‌‌‌‌లోని యూఎస్ బేస్‌‌పై ఇరాన్ డ్రోన్‌‌లతో దాడికి పాల్పడింది. అయితే, ఉద్రిక్తతలు తీవ్రమైనప్పటికీ, హార్మూజ్ గుండా వాణిజ్య నౌకల రవాణా కొనసాగుతోందని సెంట్రల్ కమాండ్ ఆదివారం తెలిపింది.

మళ్లీ యుద్ధం వస్తే.. ఇరాన్ ఉండదు: ట్రంప్ 

యుద్ధాన్ని మళ్లీ ప్రారంభించాల్సిన పరిస్థితే వస్తే ఇరాన్ అనే దేశం ఇక ఉనికిలో ఉండదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రంగా హెచ్చరించారు. ‘‘కాల్పుల విరమణ ఒప్పందాన్ని మళ్లీ ఉల్లంఘించినందుకు అమెరికా విమానాలు ఇరాన్ క్షిపణి, డ్రోన్ నిల్వ ప్రాంతాలను, తీరప్రాంత రాడార్ సైట్‌‌లను ధ్వంసం చేశాయి. ఇక వారు ఎప్పటికీ మారకపోవచ్చు. అప్పుడు మేం ప్రారంభించిన పనిని సైనిక పరంగా ముగించాల్సి వస్తుంది. అదేజరిగితే, ఇరాన్ ఇక ఉనికిలో ఉండదు” అని ట్రంప్ పేర్కొన్నారు. 

అమెరికాకు నరకం చూపిస్తాం: ఇరాన్ 

ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కూడా ఘాటుగా సమాధానమిచ్చింది. రాబోయే రోజుల్లో గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు నరకాన్ని చవిచూస్తాయని హెచ్చరించింది. ‘‘హార్మూజ్ జలసంధి తీరంలోని సిరిక్ వద్ద అమెరికా జరిపిన దాడులు హార్మూజ్ జలసంధిపై మాకున్న నియంత్రణను చేధించలేవు. 

కానీ నిబంధనలను ఉల్లంఘించే వారిపై మేం జరిపే దాడులు ఇతర నౌకలకు ప్రయాణ నిబంధనలను గుర్తుచేస్తాయి” అని ఐఆర్జీసీ నౌకాదళ కమాండర్ అన్నారు. ‘‘ఈ ప్రాంతంలోని అమెరికా స్థావరాల లెక్కింపు వేరేలా ఉంటుంది. రాబోయే రోజుల్లో అవి నరకాన్ని అనుభవిస్తాయి’’ అని హెచ్చరించారు. అమెరికా తన దాడులను ఇలాగే కొనసాగిస్తే, యుద్ధాన్ని ముగించడానికి జరుగుతున్న చర్చలను నిలిపివేస్తామని ఇరాన్ హెచ్చరించింది.

హార్మూజ్‌‌పై కంట్రోల్‌‌ కోసం ఇరాన్ పట్టు  

హార్మూజ్ జలసంధి ఇరాన్, ఒమన్ ప్రాదేశిక జలాల్లో ఉన్నప్పటికీ, ప్రపంచ సమాజం దీనిని చాలా కాలంగా అంతర్జాతీయ మార్గంగానే పరిగణిస్తోంది. ఒమన్ వైపున్న మార్గం గుండా వెళుతున్న నౌకలపై ఇటీవల ఇరాన్ రెండుసార్లు దాడిచేసింది. హార్మూజ్​ను తానే ఒంటరిగా పరిపాలించాలని ఇరాన్ పట్టుబడుతోంది. కాగా, అమెరికా సమక్షంలో కాల్పుల విరమణ ఒప్పందంపై లెబనాన్, ఇజ్రాయెల్ సంతకాలు చేసినప్పటికీ, ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా టెర్రరిస్ట్ గ్రూప్, ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.