- వరద నీటి కష్టాలకు ఇవే ప్రధాన కారణాలు
- పర్యావరణవేత్త దొంతి నరసింహారెడ్డి
ముషీరాబాద్, వెలుగు: నగరంలో అధికారుల పర్మిషన్లు, ప్లానింగ్ లేకుండా నిర్మిస్తున్న ఇండ్లు, అపార్ట్మెంట్లతోనే వరద ముప్పు ఏర్పడుతుందని పర్యావరణ వేత్త డాక్టర్ దొంతి నరసింహారెడ్డి అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రజా సంఘాలు, పర్యావరణవేత్తలతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం, అర్బన్ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హైదరాబాద్ లో ‘వరద నీటి కష్టాలు.. ప్రభుత్వ సన్నద్ధత’ అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ ఆఫీసర్లు చట్టాలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడం, ప్లానింగ్ లేకుండా ఇండ్లు, అపార్ట్ మెంట్స్ నిర్మించడం వల్లే వరద ముప్పు ఏర్పడుతుందన్నారు. మెట్రో ట్రైన్ పిల్లర్లు, స్టేషన్ల కింద డివైడర్స్ కారణంగా వర్షపు నీరు ఎటు వెళ్లకుండా నీరు నిలిచిపోతుందని, సరైన డ్రైనేజీ వ్యవస్థలేకపోవడం వల్ల రోడ్లు.. కాల్వల్లా మారిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అపార్ట్మెంట్లు, ఇండ్లల్లో ఇంకుడు గుంతలు లేకపోవడం వల్ల వర్షపు నీరు నేరుగా రోడ్ల మీదకే వెళ్తోందని, ఇంకుడు గుంతల నిర్మాణాన్ని అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలో ప్రజా సమస్యలపై పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు, పర్యావరణవేత్తలు, సంక్షేమ సంఘాలతో సీఎం రేవంత్రెడ్డి తక్షణమే సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పర్యావరణంలో వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకొని పట్టణ ప్రణాళికలను రూపొందించాలని ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ లుబ్నా సర్వత్ కోరారు. వర్షపు నీటిని నిల్వ చేసుకునేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అర్బన్ డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ శ్రీనివాస్, హెచ్ సీఎఫ్ ప్రధాన కార్యదర్శి కె.వీరయ్య, మల్లం రమేశ్, పి. శ్రీనివాసరావు, రాజమౌళి, డి.సైదులు, సంగీత, శ్వేత తదితరులు పాల్గొన్నారు.
