అమరుల  కుటుంబాలకు అండగా ఉంటాం: బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్   

అమరుల  కుటుంబాలకు అండగా ఉంటాం: బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్   

చేవెళ్ల, వెలుగు: తెలంగాణ మలిదశ ఉద్యమ అమరవీరుడు మందడి యాదిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఆదివారం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌‌‌‌తో కలిసి మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమంగళారంలోని యాదిరెడ్డి నివాసానికి కేటీఆర్ వెళ్లారు. అక్కడ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. యాదిరెడ్డి సోదరుడు ఓం రెడ్డి కుమార్తె గొంతు సమస్యతో బాధపడుతున్నట్టు ఆయన తల్లి చంద్రమ్మ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై తక్షణమే స్పందించిన కేటీఆర్.. ఆ చిన్నారి గొంతు శస్త్రచికిత్సకు అయ్యే పూర్తి ఖర్చులను తానే స్వయంగా భరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం యాదిరెడ్డి ఢిల్లీ వేదికగా చేసుకున్న ఆత్మబలిదానం అప్పట్లో ఢిల్లీ పీఠాన్ని కదిలించిందని గుర్తుచేశారు. అమరవీరుల త్యాగాలను బీఆర్ఎస్ ఎన్నటికీ మరువదని స్పష్టం చేశారు.

తమ ప్రభుత్వ హయాంలో యాదిరెడ్డి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు రూ.10 లక్షల ఆర్థిక సహాయం, 500 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించామని తెలిపారు. భవిష్యత్తులోనూ ఆ కుటుంబానికి పార్టీ తరపున పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. ఇదే పర్యటనలో భాగంగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన మొయినాబాద్ మండలం ఎన్కేపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త డప్పు కరంచంద్ కుటుంబాన్ని కూడా కేటీఆర్ పరామర్శించారు. వారి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ పరామర్శ కార్యక్రమాల్లో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, కొత్త నరసింహారెడ్డి, దేశమోళ్ల ఆంజనేయులు, మొయినాబాద్, చేవెళ్ల మండలాల పార్టీ అధ్యక్షులు దారెడ్డి వెంకటరెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.