- ఇతర రాష్ట్రాల కూలీల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా సప్లై
- యువతే టార్గెట్‌గా చైన్ నెట్‌వర్క్!
- పోలీసులకు సవాల్‌గా మారిన డ్రగ్స్ నెట్‌వర్క్ ట్రేసింగ్
మహబూబ్నగర్, వెలుగు : మహబూబ్నగర్ జిల్లాలో పోలీసులు పటిష్ట నిఘా ఉంచి, నిరంతరం కేసులు నమోదు చేస్తున్నప్పటికీ గంజాయి రవాణా, విక్రయాలు ఏమాత్రం తగ్గడం లేదు. యువత ఈ మహమ్మారికి బానిసలై, మత్తులో రకరకాల నేరాలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఒకరి నుంచి ఒకరికి చైన్ సిస్టమ్ తరహాలో సరుకును సరఫరా చేసుకుంటుండడంతో, ఈ లింకులను ఛేదించడం పోలీసు యంత్రాంగానికి పెద్ద సవాల్‌గా మారింది.
ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి..
మహబూబ్నగర్ జిల్లాలో గత జనవరి నుంచి ఇప్పటి వరకు 12 గంజాయి కేసులు నమోదు కాగా, ఇందులో ఏడు కేసులు జడ్చర్ల పరిధిలోనే అయ్యాయి. ఈ కేసుల్లో దాదాపు ఏడున్నర కిలోల గంజాయిని ఆఫీసర్లు సీజ్ చేశారు. జడ్చర్ల పట్టణం హైదరాబాద్‌కు దగ్గరలో ఉండడం, ఇక్కడే సెజ్ఉండడం, బాలానగర్, రాజాపూర్ మండలాల పరిధిలో ఫార్మా కంపెనీలు, ఐరన్, ఇతర పరిశ్రమలు ఉండడంతో ఉత్తర్ ప్రదేశ్, బీహార్, ఒరిస్సా ప్రాంతాల నుంచి ఉపాధి కోసం యువత వస్తున్నారు.
ఈ రాష్ర్టాలకు చెందిన దినసరి కూలీలు కూడా ఇక్కడ పనులు చేసుకోవడానికి వస్తున్నారు. వీరిలో చాలా మందికి గంజాయి అలవాటు ఉన్నట్లు తెలిసింది. వీరు వారి ప్రాంతాల నుంచి వస్తున్న క్రమంలో రైళ్లల్లో అక్రమంగా గంజాయిని తెచ్చుకుంటున్నారు. మరోవైపు కర్నాటక నుంచి కూడా సరుకును రోడ్డు మార్గాన కొందరు యువకులు బైకులపై తెలంగాణ-సరిహద్దులు దాటిస్తున్నట్లు తెలిసింది. మహారాష్ర్ట నుంచి తెస్తున్న సరుకును రైలులో తెస్తున్నట్లు సమాచారం. ఆయా ప్రాంతాల నుంచి తెచ్చిన ఈ సరుకును మహబూబ్నగర్ జిల్లాతో పాటు నారాయణపేట జిల్లాలోని కొన్ని ఏరియాలకు తరలిస్తున్నట్లు తెలిసింది.
యువతే టార్గెట్..
స్థానికంగా ఆయా కంపెనీల్లో పని చేస్తున్న యువతను టార్గెట్‌చేసి, వారికి గంజాయి అలవాటు చేస్తున్నారు. వారి కాంటాక్ట్ లిస్ట్ తయారు చేసుకొని, కావాల్సిన వారికి నిర్మానుష్య ప్రదేశాలు, వ్యవసాయ పొలాలు, రియల్ ఎస్టేట్ వెంచర్ల వద్ద సరుకును సప్లై చేస్తున్నారు. పలుమార్లు పక్కా సమాచారంతో ఆఫీసర్లు దాడులు చేసి, గంజాయి విక్రేతలను పట్టుకొని సరుకును స్వాధీనం చేసుకుంటున్నారు. విక్రేతలపై కేసులూ పెడుతున్నారు. అయినా జడ్చర్ల ప్రాంతంలో గంజాయి అమ్ముతూ తరచూ ఇతర రాష్ర్టాలకు చెందిన కూలీలు పట్టుబడుతూనే ఉన్నారు. మహబూబ్‌నగర్‌లోనూ గంజాయి విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. స్కూల్స్, కాలేజీలకు చెందిన యువతను టార్గెట్ చేసి గంజాయిని అమ్ముతున్నట్లు తెలుస్తోంది.
యాంటీ డ్రగ్స్ టీమ్ ఏర్పాటు చేశాం
డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలన కోసం యాంటీ డ్రగ్స్ టీమ్ ఏర్పాటు చేశాం. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల వద్ద స్పెషల్ డ్రైవ్ లో భాగంగా రుద్ర స్పెషల్ డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నాం. పాన్ షాపుల వద్ద, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాం. డ్రగ్స్, మత్తు పదార్థాల వాడకంపై ప్రతీ స్కూల్, కాలేజీల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. డ్రగ్స్, గంజాయి వాడకంపై, అమ్మకాలపై ఎవరికైనా తెలిసినా, అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. - డి.జానకి, ఎస్పీ, మహబూబ్నగర్
