పద్మారావునగర్, వెలుగు: రైళ్లలో ప్రయాణికులు మరిచిపోయిన రూ.29.15 లక్షల విలువైన బంగారు నగలు, నగదును సికింద్రాబాద్ ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ సిబ్బంది ‘ఆపరేషన్ అమానత్’ కింద రికవరీ చేసి ఆదివారం బాధితులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి.. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఎస్. నాగార్జున కుమార్ కుటుంబం సింహాపురి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించింది. పొరపాటున కోచ్‌లోనే హ్యాండ్‌బ్యాగ్ మరిచిపోయారు.
రైల్వే పోలీసులు తక్షణమే స్పందించి ఆ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో 172 గ్రాముల బంగారు నగలు, రూ.45 వేల నగదు, రెండు మొబైల్స్ ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.27.05 లక్షలు ఉంటుంది. మరో ఘటనలో విశాఖపట్నానికి చెందిన కె.సురేశ్ రైలులో బ్యాగ్ మరిచిపోయాడు. బ్యాగులో రూ.2.10 లక్షల నగదు ఉండగా ‘రైల్ మదద్’ ఫిర్యాదు ఆధారంగా ఆర్‌పీఎఫ్ సిబ్బంది రికవరీ చేసి అందజేశారు. ప్రయాణికుల సొత్తును కాపాడటంలో ప్రతిభ కనబరిచిన ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ అధికారులను సికింద్రాబాద్ ఆర్‌పీఎఫ్ సీనియర్ డీఎస్‌సీ నవీన్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.
