రైతులకు సంకెళ్లు వేసిన వాళ్లే..ఇపుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నరు

రైతులకు సంకెళ్లు వేసిన వాళ్లే..ఇపుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నరు
  •     మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శ 
  •     రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు పొంగులేటి, తుమ్మల

ముదిగొండ, వెలుగు : అధికారంలో ఉన్నప్పుడు రైతుల చేతులకు సంకెళ్లు వేసిన వాళ్లే, ఇప్పుడు రైతు సమస్యలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు వారిని నమ్మే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సాహసోపేత నిర్ణయాలతో అన్నదాతలకు కొండంత అండగా నిలుస్తోందని చెప్పారు. ఈ నెల 30న జరగనున్న ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం, హెలిప్యాడ్, పార్కింగ్ స్థలాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.

అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ కొందరు వ్యక్తులు రాష్ట్ర ప్రభుత్వంపై అనవసరంగా అవాకులు,  చవాకులు పేలుతున్నారన్నారు. ఇదే ఖమ్మం పట్టణంలో రైతుల కష్టాలు పట్టించుకోకుండా, అన్నదాతలకు సంకెళ్లు వేసి జైలుకు తీసుకెళ్లిన విషయాన్ని జిల్లా ప్రజలు ఎన్నటికీ మర్చిపోరన్నారు. అపుడు రైతులను విస్మరించి, హింసించిన వాళ్లే.. ఇప్పుడు కపట ప్రేమ చూపుతున్నారని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలందరినీ కలుపుకుని సభను సక్సెస్ చేస్తామని చెప్పారు. కొద్దిసేపటి తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించారు. రెండు, మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రులు తుమ్మల, పొంగులేటి ఆఫీసర్లను ఆదేశించారు. వారి వెంట ఎమ్మెల్యేలు రామ్మూర్తి నాయక్, మట్ట రాగమయి దయానంద్, కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ ఉన్నారు.