అంబేద్కర్ జీవితం అందరికి ఆదర్శం : మంత్రి దామోదర్ రాజనర్సింహా

అంబేద్కర్ జీవితం అందరికి ఆదర్శం : మంత్రి దామోదర్ రాజనర్సింహా

శివ్వంపేట, వెలుగు: రాజ్యంగ నిర్మాత డాక్టర్​ బి.ఆర్​.అంబేద్కర్​ జీవితం అందరికి ఆదర్శమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పిల్లుట్ల గ్రామంలో నూతనంగా నెలకొల్పిన బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించటం ఆనందంగా ఉందన్నారు. ఈ విగ్రహం సమానత్వానికి ప్రతీక, సామాజిక న్యాయానికి చిహ్నమన్నారు.  

ప్రతి పేద కుటుంబానికి ఆశాజ్యోతి, ప్రతి యువకుడికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. అంబేద్కర్​ చిన్నతనంలోనే కుల వివక్షను ఎదుర్కొన్నారని,  చదువుతో ప్రపంచాన్ని గెలిచారన్నారు. అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాడారని,  సమాన హక్కుల కోసం దేశవ్యాప్తంగా ఉద్యమించారన్నారు.  బాబాసాహెబ్ చెప్పిన మార్గంలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, మానవ గౌరవం కోసం మనమందరం కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్​ ఎమ్మెల్యే సునీతా రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ ఇంచార్జి రాజిరెడ్డి, స్థానిక సర్పంచ్​ మురళీ, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.

వెల్దుర్తి, వెలుగు: మెదక్ జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని ఆదివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. అనంతరం గ్రంథాలయంలో పలు రికార్డులను తనిఖీ చేసి, గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను పరిశీలించారు. అనంతరం గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం 11 వ వార్షికోత్సవం కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్​ సుహాసిని రెడ్డి, డీసీసీ ప్రసిడెంట్​ ఆంజనేయులు గౌడ్​, కాంగ్రెస్ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్​చార్జిఆవుల రాజిరెడ్డి, నాయకులు నరేందర్ రెడ్డి, సుధాకర్ గౌడ్, భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.