సిద్దిపేట, వెలుగు : 'మా ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా మారిస్తే... సీఎం రేవంత్ రెడ్డి మాత్రం గిరిజనుల భూములు లాక్కుంటూ ఆయన అన్నదమ్ములకు కట్టబెడుతున్నారు' అని మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (టీఐసీసీఐ) ఆధ్వర్యంలో బుధవారం సిద్దిపేటలో జరిగిన గిరిజన పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
ఎస్టీ కార్పొరేషన్‌కు మూడేండ్లలో ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని, కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో గిరిజనులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ భూములకు పట్టాలు ఇస్తామన్న రేవంత్ రెడ్డి.. లక్ష ఎకరాల అసైన్డ్ భూములను గుంజుకున్నారని, లగచర్లలో భూములు ఇవ్వబోమని చెప్పిన వారిని జైలులో పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్నారు.
గిరిజనుల భూములను లాక్కొని తన సోదరుడు కొండల్ రెడ్డికి, అల్లుడు సత్యకు కట్టబెట్టారని ఆరోపించారు. టీఐసీసీఐ ఆధ్వర్యంలో గిరిజన యువత జాబ్ క్రియేటర్స్ గా ఎదగాలని, యువతకు అన్యాయం జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా పని చేయాలని సూచించారు.
అనంతరం సిద్దిపేటలోని ఎల్ వీ ప్రసాద్ కంటి హాస్పిటల్ ను సందర్శించి ప్రజలకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. తన క్యాంప్ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో సిద్దిపేట లైట్ మోటార్ వెహికల్స్ అసోసియేషన్ సభ్యులకు ఇన్సూరెన్స్బాండ్లు అందజేశారు.
